పాడేరు ఘాట్ రోడ్​లో.. ఘోర ప్రమాదం

పాడేరు ఘాట్ రోడ్​లో..  ఘోర ప్రమాదం
  • 100 అడుగుల లోయలో పడిన ఏపీ ఆర్టీసీ బస్సు
  • ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు

పాడేరు: ఏపీలోని అల్లూరి జిల్లా పాడేరు ఘాట్‌‌రోడ్డులో ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. విశాఖ నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘాట్‌‌ రోడ్డు వ్యూ పాయింట్‌‌ వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.  పల్టీలు కొట్టిన బస్సు 100 అడుగుల లోయలోకి పడిపోయింది.  ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. స్థానికులు తీవ్రంగా శ్రమించి గాయపడినవారిని రోడ్డుపైకి తీసుకువచ్చారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌‌ కూడా గాయపడ్డాడు. 

పాడేరు నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సులో గాయపడినవారిని పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెట్టు కొమ్మలు రోడ్డుపైకి వాలిపోవటం, ఘాట్ రోడ్డుకు రక్షణ గోడ లేకపోవడం ఈ  ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపించారు. 'బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు మృతి చెందారు.  తీవ్రంగా గాయపడ్డ నలుగురిని విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలినవారిని పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారందరికీ చికిత్స అందిస్తున్నాం. అవసరమైతే  గాయపడ్డ వారిని మెరుగైన వైద్యచికిత్స కోసం విశాఖపట్నం తరలిస్తాం' అని అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ అన్నారు.

గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలి: పురంధేశ్వరి

పాడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని, తీవ్రంగా గాయపడిన బాధితులను విశాఖకు తరలించాలని ఆమె కోరారు. ఈ ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు బీజేపీ తరఫున తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.