మామను తప్పించబోయి అల్లుడు మృతి.. పోచంపాడ్లో ఘటన

మామను తప్పించబోయి అల్లుడు మృతి.. పోచంపాడ్లో ఘటన

బాల్కొండ,వెలుగు: వివాహితతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తప్పించబోయి అమాయకుడు కత్తిపోటుకు బలయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్  జిల్లా పోచంపాడ్  వడ్డెర కాలనీకి చెందిన శ్రీకాంత్  కొంతకాలంగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన ఆమె బావ వేముల నర్సింలు, అతడి కొడుకులు దీనిని మానుకోమని నచ్చజెబుతూ పలుమార్లు పంచాయితీ పెట్టించారు. ఈక్రమంలో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న వేముల నర్సింలు ఇంటికి మంగళవారం తన బావ వేణు, అల్లుళ్లు రుతిక్, రిశిక్ తో కలిసి శ్రీకాంత్​ వెళ్లాడు.

నర్సింలు కొడుకులు ఉదయ్, కిశోర్ పై కర్రలతో దాడి చేశారు. అప్పుడే బయటి నుంచి వచ్చిన నర్సింలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా వినలేదు. కొడుకులను కాపాడే ప్రయత్నంలో నర్సింలు పక్కనే ఉన్న కూరగాయలు కోసే కత్తితో శ్రీకాంత్ పై దాడి చేసేందుకు యత్నించగా, అతడి అల్లుడు రిశీక్  అడ్డురావడంతో కత్తి పొడుచుకుంది. అతడిని నిర్మల్  ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి చనిపోయాడు. మృతుడి తండ్రి కంప్లైంట్  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. దాడిలో గాయపడ్డ ఉదయ్, కిశోర్  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.