భార్య మృతితో మనస్తాపం..ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

భార్య మృతితో మనస్తాపం..ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
  •     చిన్నారుల ఆలనాపాలనా, ఆర్థిక ఇబ్బందులతో దారుణం
  •     ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘటన

హైదరాబాద్, వెలుగు: ఏపీలోని నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపి ఆపై తానూ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం..తుడుములదిన్నె గ్రామానికి చెందిన సత్యం (35), మహేశ్వరి ( 32) దంపతులకు ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ (7), రాజేశ్వరి(4), సూర్యగగన్‌‌(2) ఉన్నారు. సత్యం బిల్డంగ్ కన్ స్ట్రక్షన్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

అయితే, మహేశ్వరి అనారోగ్యం కారణంగా 8 నెలల కిందట ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి సత్యం ఒక్కడే తన ముగ్గురు పిల్లలను చూసుకుంటున్నాడు. పిల్లల ఆలనాపాలనా భారం, ఆర్థిక ఇబ్బందులు, భార్య మరణంతో మానసికంగా కృంగిపోయాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో తన ముగ్గురు పిల్లలతో విషం కలిపిన కూల్‌‌డ్రింక్‌‌ తాగించి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఫ్యాన్‌‌కు ఉరివేసుకొన్నాడు. స్థానికులు, బంధువులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భార్య మరణంతో మానసిక క్షోభకు గురైన సత్యం..ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. పిల్లల మరణానికి కచ్చితమైన కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం తెలుస్తాయన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. న్యూఇయర్ వేళ ఒకే కుటుంబంలో ముగ్గురు పిల్లలు, తండ్రి చనిపోవడంతో తుడుములదిన్నె గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.