గణేశ్‌‌‌‌ నిమజ్జనాల్లో అపశ్రుతులు వనపర్తి జిల్లాలో ట్రాక్టర్‌‌‌‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు మృతి

గణేశ్‌‌‌‌ నిమజ్జనాల్లో అపశ్రుతులు వనపర్తి జిల్లాలో ట్రాక్టర్‌‌‌‌ను ఢీకొట్టిన డీసీఎం.. ఇద్దరు మృతి
  • నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద సాగర్‌‌‌‌ కాల్వలో పడి తండ్రీకొడుకు గల్లంతు
  • డీజ్‌‌‌‌ సౌండ్‌‌‌‌ కారణంగా భైంసాలో నలుగురికి అస్వస్థత
  • మెదక్‌‌‌‌ జిల్లాలో కుంటలో పడి యువకుడు మృతి 

మిర్యాలగూడ, వెలుగు : గణేశ్‌‌‌‌ నిమజ్జనానికి వచ్చిన తండ్రీకొడుకు సాగర్‌‌‌‌ కాల్వలో పడి గల్లంతయ్యారు. ఈ ఘటన నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాడుగులపల్లి మండలం ఆగా మోత్కూర్‌‌‌‌ గ్రామానికి చెందిన పున్న సాంబయ్య (50) వంట మాస్టర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య చంద్రకళ గతంలో చనిపోవడంతో కుమారుడు శివమణి (20), కూతురు నందినితో కలిసి ఉంటున్నాడు. వినాయకుడి నిమజ్జనం కోసం సాంబయ్య, శివమణి గ్రామస్తులతో కలిసి శుక్రవారం మధ్యాహ్నం వేములపల్లిలోని నాగార్జున సాగర్‌‌‌‌ ఎడమ కాల్వ వద్దకు చేరుకున్నారు. 

నిమజ్జనం అనంతరం సాంబయ్య కాల్వలోకి దిగి స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. గమనించిన అతడి కొడుకు శివమణి టవల్‌‌‌‌ వేసి తండ్రిని కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ పట్టుతప్పడంతో అతడు కూడా నీటిలో పడిపోయాడు. గమనించిన స్థానికులు తండ్రీకొడుకులను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఇద్దరూ గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ సబ్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ నారాయణ అమిత్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్‌‌‌‌రాజు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ టీమ్‌‌‌‌ను రప్పించి సాగర్‌‌‌‌ కాల్వలో గాలింపు చేపట్టారు. 

నిమజ్జనానికి వెళ్లి వస్తుండగాప్రమాదం.. ఇద్దరు మృతి

పెబ్బేరు, వెలుగు : గణేశ్‌‌‌‌ నిమజ్జనానికి వెళ్తి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపూర్‌‌‌‌ సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పెబ్బేరు ఎస్సై యుగంధర్‌‌‌‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... వనపర్తి మండలం నాచహల్లి గ్రామానికి చెందిన యువకులు గణేశ్‌‌‌‌ నిమజ్జనం కోసం బీచుపల్లికి వచ్చారు. నిమజ్జనం ముగించుకొని తిరిగి ట్రాక్టర్‌‌‌‌లో స్వగ్రామానికి వెళ్తున్నారు. 

ఈ క్రమంలో రంగాపూర్‌‌‌‌ సమీపంలోని పాత గురుదత్త దాబా వద్దకు రాగానే టాక్టర్‌‌‌‌ను ఓ డీసీఎంవెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో సాయితేజ (25), శంకర్‌‌‌‌ (28) అక్కడికక్కడే చనిపోగా, అబ్దుల్లా, విష్ణు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు హైవే అంబులెన్స్‌‌‌‌లో వననపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌‌‌‌ నిమ్స్‌‌‌‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

డీజే సౌండ్‌‌‌‌తో నలుగురికి అస్వస్థత

భైంసా, వెలుగు : గణేశ్‌‌‌‌ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే సౌండ్‌‌‌‌ కారణంగా నలుగురు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన నిర్మల్‌‌‌‌ జిల్లా భైంసాలో గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... శోభాయాత్ర టైంలో 60కి పైగా డిజేలు పెట్టడంతో వాటి నుంచి వచ్చే సౌండర్‌‌‌‌, వైబ్రేషన్స్ కారణంగా పట్టణంలోని కీర్తి అనే యువతితో పాటు కిసాన్‌‌‌‌గల్లి, మార్కెట్‌‌‌‌ ఏరియా, కాలోని ప్రాంతాలకు చెందిన ముగ్గురు చిన్నారులు స్పృహ తప్పి కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లి ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందించారు. వారంతా సేఫ్‌‌‌‌గా ఉండడంతో అర్ధరాత్రి హాస్పిటల్‌‌‌‌ నుంచి డిశ్చార్జి చేశారు. 

కుంటలో మునిగి యువకుడు...

మెదక్‌‌‌‌టౌన్‌‌‌‌, వెలుగు : మెదక్‌‌‌‌ జిల్లా హవేలీ ఘనపూర్‌‌‌‌ మండలం తోగిటలో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఓ యువకుడు కుంటలో పడి చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సుధాకర్‌‌‌‌ (17) అనే యువకుడు శుక్రవారం సాయంత్రం గణేశ్‌‌‌‌ను నిమజ్జనం చేయడానికి ఫ్రెండ్స్‌‌‌‌తో కలిసి స్థానిక రామస్వామికుంట వద్దకు వెళ్లాడు. నిమజ్జనం అనంతరం సుధాకర్‌‌‌‌ కనిపించకపోవడంతో ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఈతగాళ్లను రప్పించి రామస్వామి కుంటలో  గాలించగా సుధాకర్‌‌‌‌ డెడ్‌‌‌‌బాడీ దొరికింది. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.