
- ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై మార్చిలో సూసైడ్ చేసుకున్న యువకుడు
- కొడుకు మృతి తట్టుకోలేక గడ్డిమందు తాగిన తండ్రి
తిమ్మాపూర్, వెలుగు : ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసై రెండు నెలల కింద కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో... ఆ బాధను తట్టుకోలేక తండ్రి సైతం సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మన్నెంపల్లిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సిరికొండ తిరుపతిరావు (48)కు నిఖిల్‌రావు ఒక్కడే కొడుకు. హైదరాబాద్‌లో ఉండే అతడు ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారి మార్చి10న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అప్పటి నుంచి తిరుపతిరావు, అతడి భార్య తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో తిరుపతిరావు ఆదివారం మధ్యాహ్నం.. తన కొడుకు ఆత్మహత్య చేసుకున్న బావి వద్దకే వెళ్లి గడ్డి మందు తాగి, భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె గ్రామస్తులతో సహకారంతో తిరుపతిరావును కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించగా, అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ సోమవారం చనిపోయాడు.