వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉందా..? స్మోకింగ్ చేసే తండ్రి వల్ల పుట్టబోయే బిడ్డకు డయాబెటిస్..!

వైఫ్ ప్రెగ్నెన్సీతో ఉందా..? స్మోకింగ్ చేసే తండ్రి వల్ల పుట్టబోయే బిడ్డకు డయాబెటిస్..!

చెడు వ్యసనాలకు అలవాటు కావడానికి ఎంతో టైం పట్టదు. కానీ వాటి నుంచి బయటపడాలంటే.. చాలా సమయం పడుతుంది. అందులోనూ స్మోకింగ్.. కొందరిని జీవితకాలం వెంటాడుతుంది. మానేయాలని మనసులో ఉన్నా ఆ వ్యసనానికి బానిసైపోవడంతో దాన్నుంచి బయటపడలేక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అయితే, స్మోకింగ్ అనేది ఒక్క వ్యక్తినే కాదు.. పుట్టబోయే సంతానాన్ని కూడా అనారోగ్యం పాలు చేస్తోందని, దాన్ని వీలైనంత త్వరగా మానేయడం ఉత్తమమని ఎక్స్​పర్ట్స్​ హెచ్చరిస్తున్నారు. రీసెంట్​గా వచ్చిన స్టడీ ప్రకారం స్మోకింగ్​ చేసే తండ్రి వల్ల పుట్టబోయే బిడ్డకు డయాబెటిస్ రావొచ్చని తేలింది!

సాధారణంగా ప్రెగ్నెన్సీ టైంలో తల్లి తీసుకునే ఆహారం, అలవాట్లు పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతాయని మనకు తెలుసు. కానీ, తండ్రి అలవాట్లు కూడా ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా నికోటిన్ వాడకం.. పుట్టబోయే బిడ్డ జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఈ అంశంపై ప్రొఫెసర్ రాక్వెల్ చమోరో-– గార్సియా టీం జరిపిన పరిశోధన కొత్త విషయాలను బయటపెట్టింది. జర్నల్​ ఆఫ్​ ది ఎండోక్రైన్ సొసైటీలో మార్చి12న ప్రచురితమైన స్టడీ ప్రకారం.. పొగాకు వాడకం ప్రపంచంలోనే నివారించదగిన అనారోగ్య కారణాల్లో ముఖ్యమైనది. ధూమపానం, ఇ–-సిగరెట్లు, నికోటిన్ పౌచెస్ వాడకం, వేపింగ్ వంటి అలవాట్లు తగ్గిస్తే డయాబెటిస్​ రాకుండా కొంతవరకు అరికట్టొచ్చని సైంటిస్ట్​లు చెప్తున్నారు.

ఎలుకల మీద చేసిన ఈ రీసెర్చ్​లో మగ ఎలుకలను రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపుకు నార్మల్ వాటర్​ని, మరొక గ్రూపుకు నికోటిన్ కలిపిన నీటిని అందించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, సిగరెట్ పొగ ద్వారా కాకుండా నేరుగా నికోటిన్ మాత్రమే అందించారు. దీనివల్ల పొగాకులో ఇతర రసాయనాల ప్రభావం లేకుండా కేవలం నికోటిన్ వల్ల కలిగే మార్పులను కచ్చితంగా అంచనా వేయడానికి వీలైంది. నికోటిన్ కలిపిన నీళ్లు తాగిన మగ ఎలుకల ద్వారా జన్మించిన సంతానాన్ని వాళ్లు స్టడీ చేశారు.

ఎపిజెనెటిక్ మార్పులు
ఈ స్టడీలోని ప్రధాన అంశం ‘ఎపిజెనెటిక్స్’. తండ్రి నికోటిన్ తీసుకున్నప్పుడు అది అతని శుక్ర కణాలలోని డీఎన్​ఎ క్రమాన్ని మార్చకపోయినప్పటికీ డీఎన్​ఎ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీన్నే ‘ఎపిజెనెటిక్ ఇన్​హెరిటెన్స్’ అంటారు. అంటే, తండ్రి పొగాకు వాడటం వల్ల అతని సంతానంలో కొన్ని జన్యువులు అవసరమైన దానికంటే ఎక్కువగా లేదా తక్కువగా పనిచేయడం మొదలుపెడతాయి. ఇది నేరుగా పుట్టబోయే బిడ్డ జీవక్రియపై ప్రభావం చూపుతుంది.

వేర్వేరు ప్రభావాలు 
ఈ రీసెర్చ్​లో ఆడ, మగ సంతానంలో వేర్వేరు ప్రభావాలు కనిపించాయి. ఆడ సంతానంలో.. ఇన్సులిన్ స్థాయిలు, బ్రేక్​ఫాస్ట్​కి ముందు ఉండాల్సిన గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయి. ఇన్సులిన్ తక్కువగా ఉండటం అంటే భవిష్యత్తులో గ్లూకోజ్ కంట్రోల్ తప్పి డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్​పర్ట్స్ అనుమానిస్తున్నారు. అయితే మగ సంతానంలో కూడా గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, లివర్ పనితీరులో స్పష్టమైన మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ‘స్టీటోటిక్ లివర్ డిసీజ్’ లేదా ఫ్యాటీ లివర్ వంటి లక్షణాలు మొదటి దశలో కనిపించాయి.

లివర్ పనితీరు 
సాధారణంగా మనం ఆహారం తీసుకోక ముందు మన రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోకుండా కాలేయం గ్లూకోజ్‌ను విడుదల చేస్తుంది. కానీ నికోటిన్ ప్రభావం ఉన్న తండ్రికి పుట్టిన మగ సంతానంలో గ్లూకోజ్ స్థాయిలు చాలా తక్కువకు పడిపోయాయి. అంటే, వారి లివర్ గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేయడంలో ఫెయిల్​ అవుతోంది. ఇది జీవక్రియ లోపానికి బలమైన సంకేతం.

నికోటిన్ ప్రొడక్ట్స్​ వాడినా..
ఈ రీసెర్చ్​ నేటితరం వాడుతున్న ఇ– -సిగరెట్లు, నికోటిన్ పౌచ్‌లు వంటి వాటిపై కూడా హెచ్చరికలు చేస్తోంది. ‘‘మేం ఎలుకలకు కేవలం స్వచ్ఛమైన నికోటిన్‌ను మాత్రమే ఇచ్చాం. అయినా వాటి సంతానంలో ఇన్ని మార్పులు వచ్చాయి. అంటే పొగాకు తాగడం వల్ల వచ్చే పొగ మాత్రమే కాదు, కేవలం నికోటిన్ కూడా ప్రమాదకరమే’’ అని పరిశోధకులు స్పష్టం చేశారు.

ప్రీకాన్సెప్షన్ కేర్
ఈ స్టడీ ఎలుకలపై జరిగినప్పటికీ, అన్ని క్షీరదాల జీవక్రియ వ్యవస్థలు ఒకేలా ఉంటాయి.. కాబట్టి మనుషులకు కూడా ఇది వర్తిస్తుంది. మధుమేహం అనేది కేవలం మనం తినే ఆహారం లేదా వ్యాయామంపైనే కాకుండా, మన తండ్రి గత అలవాట్లపై కూడా ఆధారపడి ఉండొచ్చని ఈ పరిశోధన ప్రూవ్ చేసింది. అయితే ఇప్పటివరకు ‘ప్రీ కాన్సెప్షన్ కేర్’ అంటే కేవలం తల్లి ఆరోగ్యంపైనే దృష్టి సారించేవారు. కానీ ఈ అధ్యయనం ప్రకారం, తండ్రి కూడా గర్భధారణకు కనీసం కొన్ని నెలల ముందు నుంచే నికోటిన్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తండ్రి శరీరంలో తయారయ్యే శుక్ర కణాల ఆరోగ్యంపై నికోటిన్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని, అది బిడ్డల క్వాలిటీ ఆఫ్​ హెల్త్​ను డిసైడ్ చేస్తుందని సైంటిస్ట్​లు చెప్తున్నారు.

స్మోకింగ్​కు ఇలా గుడ్ బై చెప్పండి:
* నికోటిన్ మానేయడం అంత ఈజీ కాదు. ఇది శారీరకంగా, మానసికంగా పోరాటం చేయడమే. కానీ ఆరోగ్యం బాగుండాలంటే దీన్నుంచి బయటపడాల్సిందే. నికోటిన్ మానడానికి కొన్ని  పద్ధతులు ఉన్నాయి. 
* ఒక్కసారిగా మానేయడం కష్టమైతే, డాక్టర్ సలహాతో నికోటిన్ గమ్స్, ప్యాచెస్ వాడొచ్చు. దీన్ని నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ అంటారు. 
* మీకు ఎప్పుడు నికోటిన్ తీసుకోవాలని అనిపిస్తుందో గమనించి ఆ సమయాల్లో వేరే యాక్టివిటీస్ చేయడం అలవాటు చేసుకోవాలి. 
* నీళ్లు ఎక్కువగా తాగాలి. నికోటిన్ తీసుకోవాలి అనిపించినప్పుడు ఒక గ్లాసు చల్లని నీళ్లు తాగడం వల్ల ఆ కోరిక తగ్గుతుంది. ఇది శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపడానికి కూడా సాయపడుతుంది. 
* ఫిజికల్ యాక్టివిటీ వల్ల శరీరంలో ‘డోపమైన్’ విడుదల అవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది కాబట్టి నికోటిన్ గుర్తుకురాకుండా చేస్తుంది. 
* నికోటిన్ మానేశాక వచ్చే చిరాకు, ఆందోళనను తగ్గించుకోవడానికి లోతైన బ్రీతింగ్​ ఎక్సర్‌‌సైజ్‌లు చేయండి.