భయం కరోనా కంటే డేంజర్

భయం కరోనా కంటే డేంజర్

ప్రపంచమంతా భయపడుతోంది. రెండో వేవ్ చాలా ప్రమాదకరంగా ఉంది. మందులు సరిగా దొరకట్లేదని, హాస్పిటల్స్​లో బెడ్స్​ లేవనే మాటలు ఎక్కడికి పోయినా వినిపిస్తున్నాయి. రేపు, ఎల్లుండి ఆరోగ్యంగా ఉంటామని ఊహించుకోలేరు. ఈరోజు బాగుంటారు. కానీ, రేపు బాగుంటామో? లేదో? ఏమవుతుందో? ఏమో? అనే అనుమానం. కాబట్టి భయపడటం సాధారణమే. 

భయమేరా అన్నిటికీ మూలం 

ఆందోళన, భయాల్ని అణచుకుని బతకడం సాధ్యం కాదు. ఎవరు గుండెనిబ్బరంతో ఉంటారు?  ఎంతమంది అలా ఉండగలరు? కొవిడ్​ సోకినవాళ్లలో 99 శాతం మందికి హాస్పిటల్​ అవసరమే లేదు. కానీ, భయం వల్ల వాళ్లు డీలాపడిపోతున్నారు. అందుకే హాస్పిటల్స్​పై ఒత్తిడి పెరిగింది. కొవిడ్​ వచ్చినవాళ్లు జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి సాధారణ సమస్యలే ఉంటే ఇంట్లోనే ఐసోలేట్ ​అయిపోవాలి. హాస్పిటల్​లో చేరాల్సిన అవసరం లేదు. కానీ, మందులు వాడాలి. తెలిసిన డాక్టర్​ని ఫోన్​లో కాంటాక్ట్​ చేసి సింప్టమ్స్​ని బట్టి మందులు వాడాలి. హాస్పిటల్​లో అనవసరంగా చేరి, భయపడిపోయేవాళ్లే ఎక్కువ. అందువల్ల ఇంట్లోనే ఉంటూ తెలిసిన డాక్టర్​ పర్యవేక్షణలో ట్రీట్​మెంట్​ తీసుకోవడం బెస్ట్​. కొవిడ్​  పేషెంట్స్​లో 70 శాతం మంది  ‘చనిపోవడానికి’ భయమే కారణం. ఎక్కడికిపోవాలో తెలియదు. ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందిపడుతున్నారు. హాస్పిటల్స్​, ఆక్సిజన్​ అందుబాటులో లేక కొద్దిమంది చనిపోయారు. ‘బెడ్స్​ లేవట’, ‘ఆక్సీజన్​ లేదట’, ‘థర్డ్​వేవ్​, ఫోర్త్​ వేవ్స్​ ఉంటాయట’, ‘రెమ్డిసివిర్​ మందు కాస్ట్లీ’, ‘కార్పొరేట్​ దోపిడీ’.. ఇలాంటి మాటలు విని  ఇప్పుడు ఎక్కువ మంది చనిపోతున్నారు. 

భరోసా లేకనే భయం

‘భయపడకూడదు’ అని అందరూ చెబుతున్నారు. కానీ, భయంపోయేలా చెప్పేవాళ్లే లేరు. ప్రభుత్వం భరోసా ఇస్తే ఈ భయం పోతుంది. లక్ష మంది వచ్చినా ట్రీట్​మెంట్​ చేస్తామని ప్రభుత్వం అంటే జనానికి ఈ భయం పోతుంది. ఇప్పుడు కుప్పకూలి పోయేవాళ్లలో ఎండార్ఫిన్​ హార్మోన్​​ ఉత్పత్తి పెరిగి  వణికిపోయేవాళ్లే ఎక్కువ. ఇది భయం వల్ల జరిగే పరిణామం. ఇప్పుడు బాగానే ఉన్నాను. కానీ, రేపు, ఎల్లుండి ఎలా ఉంటుందోనన్న ఆలోచన వల్లే భయం వేస్తుంది. హాస్పిటల్స్​లో బెడ్స్​ దొరుకుతాయో లేదో? ఆక్సిజన్​ ఉంటుందో లేదో? వెంటిలేటర్​ అవసరంపడితే ఎటుపోవాలో? అన్న ఆలోచనల వల్లే భయపడుతున్నారు. కరోనా నుంచి కాపాడగలం. కానీ, ఈ భయం నుంచి బయటపడేయడం కష్టం. మందుల్లేవు, ఆక్సిజన్​ లేదు, బెడ్స్​ లేవనే వార్తల వల్ల భయపడి ఎక్కువ మంది తేలికగా కోలుకోలేకపోతున్నారు. అందువల్ల హాస్పిటల్స్​లో చేరేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. 

కౌన్సెలింగ్​ సర్వీస్​ రావాలె

ప్రభుత్వం ప్రజలకు ధైర్యం నూరిపోయాలి. లక్షల మంది కొవిడ్​ పేషెంట్స్​కి సలహా ఇచ్చే కౌన్సెలింగ్​ సెంటర్​ని ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం అయింది. అయినా అది ఎంతో అవసరం. టోల్​ ఫ్రీ నెంబర్​ ద్వారా కొవిడ్​ పేషెంట్స్​కి కౌన్సెలింగ్​ చేయాలి. ఒక సలహా ఎంతో మేలు చేస్తుంది. సమయానికి ఇచ్చే సలహాతో ఎంతో ప్రయోజనంఉంటుంది. కానీ ఆ సలహా ఇచ్చేలోగా  సమయం మించిపోతోందిప్పుడు. కొవిడ్​ సాధారణ వైరల్​ ఫీవర్​లాంటిదే. కొవిడ్​ పేషెంట్స్​లో వెయ్యిలో ఒకరికి మాత్రమే హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ అవసరం. ప్రతి రోజూ నమోదయ్యే ప్రతి వెయ్యి కేసులకు పది చొప్పున బెడ్స్​ పెంచుకుంటూ పోతే సమస్య రాదు. ప్రభుత్వం ఆ చొరవ చూపాలి. ఎక్కడ బెడ్స్​ ఖాళీ ఉంటే అక్కడికి అవసరమైన వాళ్లని అంబులెన్స్​లో పంపే బాధ్యత గవర్నమెంట్​ తీసుకుంటే అనవసరమైన గందరగోళం పోతుంది. అప్పుడు హాస్పిటల్స్​పై లోడ్​ తగ్గుతుంది. రేపు బెడ్​ దొరకదని ఎవరికివాళ్లే వచ్చి హాస్పిటల్​లో చేరే పరిస్థితి ఇలా చేస్తేనే పోతుంది.
 
ఒక సిస్టమ్​ ఉంటే మేలు

పేషెంట్స్​లో భయం, హాస్పిటల్స్​ బెడ్స్​ కొరత తగ్గించాలంటే కొవిడ్​ పాజిటివ్​ అని తెలియగానే ఆటోమేటిక్​​గా ఆ పేషెంట్​కి ఒక డాక్టర్​ని, హెల్త్​ కేర్​ వర్కర్, అడ్మినిస్ర్టేటర్​ ని అసైన్​ చేయాలి. బోలెడంత మంది అధికారులు ఉన్నారు. డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. డాక్టర్లను ఆన్​లైన్​లో చూసుకునేందుకు వేలమంది వస్తారు. ప్రతి పది మంది కొవిడ్​ పాజిటివ్​ పేషెంట్స్​కి ఒక డాక్టర్​ని కేటాయిస్తే..  భయం ఉండదు. ప్రభుత్వ డాక్టర్లతోపాటు, ప్రైవేట్​ డాక్టర్లు, యంగ్​ డాక్టర్స్​ని వాలంటరీగా ఈ సర్వీసుకు వాడుకోవాలి. కానీ ఉపయోగించుకునే మెకానిజం లేక జనం డబ్బులు పోతున్నాయ్​. ప్రాణాలూ పోతున్నాయ్. కొవిడ్​ పేషెంట్​ ఇంట్లో ఉంటూనే తనకు కేటాయించిన డాక్టర్​కి ఫోన్​ చేసి హెల్త్​ కండిషన్​ గురించి చెబుతూ, ట్రీట్​మెంట్​ తీసుకోవచ్చు. అతనికి ఆక్సిజన్​ అవసరమని లేదంటే హాస్పిటల్​లో చేరాల్సిన అవసరం ఉందని డాక్టర్​ అనుకుంటే మెడికల్​ డిపార్ట్​మెంట్​కి చెబితే ఏ హాస్పిటల్​లో బెడ్​ ఉందో అక్కడికి పంపించవచ్చు. లేదంటే ఆక్సిజన్​ అందించే ఏర్పాట్లు ఉన్న చోటకు పంపించవచ్చు. ఇలా కంప్యూటరైజ్డ్​ సిస్టమ్​ని ఏర్పాటు చేసుకుంటే బాధలు, భయం లేకుండా వైద్యం చేయొచ్చు. ప్రాణాలను కాపాడుకోవచ్చు. కొంతమంది డాక్టర్లను ఒక ప్రభుత్వ అధికారి మానిటర్​ చేస్తే ఈ సమస్యలే ఉండవు. టెక్నాలజీ ఉంది, డాక్టర్లున్నారు. అధికారులున్నారు. కానీ వాటన్నింటినీ కలిపే ఒక సిస్టమ్​ లేక ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతోంది. 

చెప్పాల్సినవి.. చెప్పకూడనివి..

మీడియా, డాక్టర్లు, ఇంకెవరైనా ఏది చెప్పినా? రాసినా మామూలు ప్రజలకు  అర్థమయ్యేలా ఉండాలి. అందరూ  మేధావులే అనుకుని చెప్పకూడదు. సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని విషయాలు చెప్పాలి. మేధావులే ఈ కరోనాకి భయపడిపోతున్నారు. ఇక మామూలు జనం సంగతి ఏమిటి? నిజాలు మాట్లాడాలి. కానీ, నిజాలు భయం పెంచుతున్నాయని గుర్తించాలి. వాస్తవాలను అనునయంగా చెప్పాలి. అప్పుడెవరూ అనవసరంగా భయపడరు. ఇప్పుడు అందరికీ ధైర్యం కావాలి. కరోనా నుంచి కోలుకున్న కోట్లాది మందిని చూపిస్తూ, వాళ్ల అనుభవాలను వినిపిస్తూ అందరిలో ధైర్యం నింపాల్సిన అవసరం ఉంది. కొవిడ్​ సోకిన వాళ్లలో సులభంగా (హాస్పిటల్​లో చేరకుండా) బయటపడ్డ వాళ్లే ఎక్కువ.ఎప్పుడైతే భయం పెరిగిందో అప్పుడు హాస్పిటల్స్​ నిండాయి. మరణాలు పెరిగాయి. ఆ విషయాలు వింటే, చూస్తే కచ్చితంగా ధైర్యమొస్తది. కొన్ని ప్రాణాలను కాపాడగలుగుతాం.  జనానికి కావాల్సింది ఒక్కటే.. ‘ఎక్కడ బెడ్​ ఖాళీ ఉంది?’ ‘ఎక్కడి వాళ్లు ఎక్కడికి పోవాలి?’ చెప్పగలిగితే జనంలో భరోసా పెరుగుతుంది. 
                                                                                                          ::: నాగవర్ధన్​ రాయల

గుండెల్లో దడ ఎందుకంటే?

భయం వల్ల అడ్రినల్ గ్రంథులు నెగెటివ్​ ఎండార్ఫిన్​ అనే హార్మోన్స్​ని  రిలీజ్​ చేస్తాయి. ఎండార్ఫిన్​ హార్మోన్​ ఎక్కువగా విడుదలైతే రక్తనాళాలు కుంచించుకుపోవడం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో రక్త సరఫరాకు ఇబ్బందులెదురవుతాయి. గుండె, మెదడు భాగాలకు రక్త సరఫరా తగ్గిపోతుంది. గుండెకండరాలు బలహీనపడ తాయి. ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా కుప్పకూలి పోతారు. ఊపిరితిత్తులకు తగినంత రక్తం అందనప్పుడు, రక్తంలో ఆక్సిజన్​ లెవల్​ కూడా తగ్గిపోతుంది.  ఆయాసం వస్తుంది. కాళ్లు, చేతులు వణుకుతాయి. చెమటలు పడతాయి. నీరసించిపోతారు. నిల్చోలేరు.


మనసుకు నచ్చేలా 

హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నప్పుడు మనసుని నొప్పించే విషయాలు, బాధపెట్టే జ్ఞాపకాల్లోకి పోకుండా మనసుకి ఇష్టమైన పనులు చేయాలి. మ్యూజిక్​ వింటూ, సినిమాలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ ఉండాలి. అప్పుడప్పుడు సొంతవాళ్లకు ఫోన్​ చేసి మాట్లాడాలి. ప్రశాంత తను ఎవరూ ఇవ్వరు. అది ఒక మానసిక స్థితి. ఇష్టమైన పనులు చేస్తుంటే ప్రశాంతత వస్తుంది. అందుకని ఎవరికి ఏది ఇష్టం ఉంటే ఆ పని చేస్తూ ఉండాలి. ఒకరు చెప్పారనో, ఇంకెవరో అలా చేసారనో అనుకరించొద్దు.

దూరంగానే దగ్గరవుదాం  

కరోనా వైరస్​ కన్నా భయమే ప్రమాదం. కొవిడ్​ పాజిటివ్​ వచ్చినవాళ్లకే ధైర్యం ఉండాలి. మానసికంగా ధైర్యంగా ఉంటేనే త్వరగా కోలుకుంటారు. కొవిడ్​ పేషెంట్​ బాధలో, దుఃఖంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు భాగమవ్వాలి.  కరోనా సోకిందంటే వెలివేస్తారని అనవసరంగా ఊహించుకుంటే భయమేస్తుంది. అలాంటి ఊహలు లేకుండా అందరికీ దూరంగా ఉంటూ, మానసికంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. కొవిడ్​ పాజిటివ్​ అని తెలిసిన వెంటనే ఒక గదిలో ఐసోలేట్​ అయిపోవాలి. ఆ గదిలోనే ఉండిపోతే ఎవరూ వెలివేసినట్లు చూడరు. కావాల్సిన భోజనం, మందులు బంధువులతో తెప్పించుకోవాలి. మనసులోని భయాల్ని, అనుమానాల్ని బంధువులు, స్నేహితులతో ఫోన్​లో చెప్పాలి. అప్పుడు మనసు తేలికపడుతుంది. 

పాము కరిస్తే చనిపోతారు. కానీ పాము కరవలేదు. కనిపించింది. కరుస్తుందేమోననే భయంతో గుండె ఆగిపోయింది. పాము కరిస్తే హాస్పిటల్​కి తీసుకుపోయి వైద్యం చేయొచ్చు. కానీ, గుండె ఆగిపోయి ప్రాణంపోతే ఎవరేమి చేస్తారు? కొవిడ్​ పేషెంట్స్​పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే ఉంది. కరోనా తీవ్రరూపం దాల్చకముందే భయపడి ప్రాణాలొదిలేస్తున్నారు. ""మందులేని భయాన్ని వదిలించుకుంటే కరోనాను గెలిచినట్లే అంటున్నారు నెఫ్రాలజిస్ట్​  ప్రొఫెసర్​ శ్రీభూషణ్​ రాజు.