ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్​కు క్రాస్​ ఓటింగ్ భయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్​కు క్రాస్​ ఓటింగ్ భయం
  • క్యాంపులు పెట్టినా కాన్ఫిడెన్స్ వస్తలె!
  • క్యాండిడేట్లలో గుబులురేపుతున్న ఇండిపెండెంట్లు
  • హైకమాండ్ ఆదేశాలతో జోరందుకున్న క్యాంపు రాజకీయాలు
  • గోవా, హైదరాబాద్ శివారు రిసార్టులకు 2,500 మందికిపైగా ఓటర్లు
  • క్యాంపుల్లోనే అసమ్మతితో తలపట్టుకుంటున్న లీడర్లు

నెట్‌‌వర్క్, వెలుగు: లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. 12 స్థానాల్లో ఆరింటిని ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్న టీఆర్ఎస్.. మిగిలిన ఆరు సీట్లను తన ఖాతాలో వేసుకునేందుకు క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. కానీ ఫీల్డ్‌‌లో సీన్ మరోలా ఉంది. ఫండ్స్, పవర్స్ విషయంలో రాష్ట్ర సర్కారుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్యాంపుల నుంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తుండడం టీఆర్​ఎస్​లో బుగులు పుట్టిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్​ లాంటి చోట్ల బలమైన ఇండిపెండెంట్లకు తోడు క్యాండిడేట్లపై వ్యతిరేకత కొంపముంచే అవకాశముందని హైకమాండ్ ఇప్పటికే​ పసిగట్టింది. ఈ క్రమంలోనే  సోమవారం నాటి ప్రెస్​మీట్‌‌లో సీఎం కేసీఆర్ ‘‘ఒకటి, రెండు స్థానాలు పోతే పోతయ్.. అయితే ఏంది?’’ అంటూ మాట్లాడారనే చర్చ నడుస్తోంది.
లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాలన్నింటినీ ఎలాగైనా ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్ఎస్ అనుకుంది. అధికార పార్టీకే మెజారిటీ ఉండటంతో కాంగ్రెస్, బీజేపీ పోటీకి దిగలేదు. కానీ లోకల్​బాడీస్​కు ఫండ్స్, పవర్స్ ఇవ్వట్లేదని కోపంతో ఉన్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు.. తమ ఫోరం తరఫున క్యాండిడేట్లను నిలిపి, గెలిపించుకుంటామని ప్రకటించారు. కానీ హైకమాండ్​ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఆయా చోట్ల తమ క్యాండిడేట్లు తప్ప ఇతరులెవరూ నామినేషన్ వేయకుండా, వేసిన వాళ్లు విత్​డ్రా చేసుకునేలా ప్రయత్నించారు. మొదట తాయిలాలు ఎరచూపారు. ఒప్పుకోనివాళ్లను నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. బెదిరించారు. పలుచోట్ల దాడులకు దిగి, నామినేషన్ పత్రాలను చించేశారు. ఫోర్జరీ సంతకాల పేరిట పలువురిని తప్పించారు. ఇన్ని చేసి ఆరు సీట్లను ఏకగ్రీవం చేసుకున్నప్పటికీ మరో ఆరు సీట్లలో బలమైన అభ్యర్థుల కారణంగా ఎన్నికలు తప్పట్లేదు. కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఆదిలాబాద్​, ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఈ నెల 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనున్నాయి.
చుక్కలు చూపుతున్న ఇండిపెండెంట్లు
ఒత్తిళ్లకు తలొగ్గకుండా బరిలో నిలిచిన పలువురు ఇండిపెండెంట్లు ప్రచార వ్యూహాలతో అధికార పార్టీకి చుక్కలు చూపుతున్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండిపెండెంట్లుగా ఉన్న మాజీ మేయర్ సర్దార్​ రవీందర్ సింగ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి చేతులు కలిపారు. ఓవైపు కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతు కూడగడుతూనే టీఆర్ఎస్ క్యాంపుల్లోని ఓటర్లతో టచ్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్తున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన ఓ ఎంపీటీసీతో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడినట్లుగా వైరల్​అవుతున్న ఆడియో.. క్యాంపుల్లోని తాజా పరిస్థితికి అద్దంపడుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ క్యాంపులోనే ఉన్న సదరు ఎంపీటీసీ.. ఇండిపెండెంట్లకు ఓటు వేసేలా ధర్మారం, జూలపల్లి మండలాల ఎంపీటీసీల మద్దతు కూడగడుతున్నట్లు తనకు సమాచారం ఉందని మంత్రే చెప్పడం ఇందుకు ఊతమిస్తోంది.

ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఉన్న ఎల్.రమణ ఈ మధ్యే టీడీపీ నుంచి వలస రాగా, భానుప్రసాద్​రావు కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఉద్యమ సమయంలో పార్టీ జెండా మోసిన వారు కాదు. మాజీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీందర్​సింగ్‌‌‌‌‌‌‌‌కు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో, ఎంపీపీల ఫోరం అధ్యక్షుడైన ప్రభాకర్​రెడ్డికి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే ఇండిపెండెంట్లకు కలిసివస్తుందనే భయం టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను వెంటాడుతోంది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో అధికార పార్టీ అభ్యర్థిగా అంతగా పరిచయం లేని విఠల్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దింపడంపై స్థానిక లీడర్లు గుర్రుగా ఉన్నారు. క్యాండిడేట్​పై ఉన్న వ్యతిరేకత..తుడుం దెబ్బ అభ్యర్థి పుష్ప గట్టి పోటీ ఇస్తుండడంతో ఇక్కడా టీఆర్ఎస్​ గెలుపు ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖమ్మంలో టీఆర్ఎస్ క్యాండిడేట్ తాతా మధుసూదన్‌‌‌‌‌‌‌‌రావుకు.. కాంగ్రెస్ అభ్యర్థి, గ్రానైట్ వ్యాపారి రాయల నాగేశ్వర్​రావు గట్టి పోటీ ఇస్తున్నారు.

మెదక్‌‌‌‌‌‌‌‌లోనూ టీఆర్ఎస్ క్యాండిడేట్ యాదవరెడ్డి ఆశలకు కాంగ్రెస్ అభ్యర్థి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల అడ్డుగా నిలబడ్డారు. ఆమెతో టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌లోని అసంతృప్త ఓటర్లు టచ్​లో ఉన్నారనే వార్తలు టీఆర్ఎస్ క్యాంపులో కలకలం రేపుతున్నాయి. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎంసీ కోటిరెడ్డికి.. ఎంపీ కోమటిరెడ్డి ప్రధాన అనచరుడు, నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్యతోపాటు ఆలేరు మాజీ ఎమ్మె ల్యే, జెడ్పీటీసీ కుడుదల నగేశ్ గట్టి పోటీ ఇస్తున్నారు. నగేశ్ ​కొద్దిరోజులుగా కాంగ్రెస్ ​సభ్యుల మద్దతు కూడగడుతూనే టీఆర్ఎస్ ​ఓటర్లతో టచ్​లోకి వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బలమున్నా భయమే..
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ఆరు స్థానాల్లో 5,328 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4,046 మంది టీఆర్ఎస్​వాళ్లే. అయినప్పటికీ ఫండ్స్, పవర్స్ విషయంలో తమపై ఉన్న వ్యతిరేకతతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎక్కడ కొంపముంచుతారో అనే భయం అధికార పార్టీని వెంటాడుతోంది. నల్గొండ తప్ప మిగిలిన అన్ని స్థానాల నుంచి ఇప్పటికే 2,500 మందిని క్యాంపులకు తరలించింది. కరీంనగర్ నుంచి 1,100 మందిని, ఆదిలాబాద్ నుంచి 300 మందిని, మెదక్ నుంచి 700 మందిని, ఖమ్మం నుంచి సుమారు 500 మందిని హైదరాబాద్, బెంగళూరు, గోవాకు తరలించింది. ఖరీదైన హోటళ్లు, రిసార్టుల్లో వాళ్ల కోసం కోట్లు ఖర్చుపెడుతోంది.

నల్గొండలోనూ నేడో రేపో క్యాంపులకు ప్లాన్ చేస్తోంది. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రవీందర్​సింగ్ నుంచి గట్టి పోటీ ఉండడంతో ఈ ఒక్క​క్యాంపుపైనే ఏకంగా రూ.30 కోట్ల దాకా ఖర్చు పెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. కరీంనగర్ నుంచి క్యాంపుల్లో ఉన్న 1,100 మందిలో ఒక్కొక్కరికి ఇప్పటికే రూ.లక్ష చొప్పున ముట్టజెప్పారని, త్వరలో మరో రూ.2 లక్షల చొప్పున ఇచ్చేందుకు మాట ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. మెదక్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒక్కో ఎంపీటీసీకి రూ.2.50 లక్షల చొప్పున, కౌన్సిలర్లకు రూ.50 వేల చొప్పున బస్సు ఎక్కే ముందే చెల్లించేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లో ఒక్కో ఓటరుకు రూ.2 లక్షల చొప్పున, ఖమ్మంలో రూ.3 లక్షల చొప్పున ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

నల్గొండ జిల్లాలో మంగళవారం ఇండిపెండెంట్లంతా కలిసి ఒక్కరికే మద్దతిచ్చేలా మంతనాలు జరపడంతో టీఆర్ఎస్ అలర్ట్​అయింది. నేడో, రేపో క్యాంపులకు రెడీ అవుతున్న టీఆర్ఎస్​ లీడర్లు.. క్యాంపుల నిర్వహణతోపాటు ఓటర్లకు ఇచ్చేందుకు సుమారు రూ.15 కోట్ల దాకా ఖర్చవుతోందని ప్రపోజల్ పెట్టినట్లు తెలిసింది. మొత్తం ఓట్లలో మూడో వంతు బలం ఉన్నా.. కేవలం స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉన్న అసంతృప్తి కారణంగా క్యాంపుల రూపంలో కోట్లు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని టీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.