29 రోజుల్లో 20 లక్షలకు పైగా బండ్ల సేల్

29 రోజుల్లో 20 లక్షలకు పైగా బండ్ల సేల్

న్యూఢిల్లీ : బండ్ల అమ్మకాలు కిందటి నెలలో 13 శాతం (ఏడాది ప్రాతిపదికన) పెరిగాయని  ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) పేర్కొంది.  టూవీలర్లు, కార్ల సేల్స్ పుంజుకున్నాయని తెలిపింది. కిందటేడాది  ఫిబ్రవరిలో 17,94,866 వెహికల్స్ అమ్ముడు కాగా,  ఈ ఏడాది ఫిబ్రవరిలో 20,29,541 అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వెహికల్స్ (కార్లు, బస్సులు వంటివి) సేల్స్ 2,93,8‌‌03 యూనిట్ల నుంచి 12 శాతం వృద్ధి చెంది 3,30,107 యూనిట్లకు చేరుకున్నాయి.

కొత్త ప్రొడక్ట్‌‌లు అందుబాటులోకి వస్తుండడంతో ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు  పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో 14,39,523 టూ వీలర్లు అమ్ముడయ్యాయని, కిందటేడాది ఫిబ్రవరిలో సేల్ అయిన 12,71,073 యూనిట్లతో పోలిస్తే  13 శాతం పెరిగాయని వివరించారు. కిందటి నెలలో 88,367 కమర్షియల్ వెహికల్స్, 94,918  త్రీ వీలర్స్ అమ్ముడయ్యాయి. అదే విధంగా 76,626 ట్రాక్టర్లు సేల్ అయ్యాయి.