నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్..వర్శిటీ పరీక్షలు వాయిదా వేయాలి

నవంబర్ 3 నుంచి కాలేజీల నిరవధిక బంద్..వర్శిటీ పరీక్షలు వాయిదా వేయాలి
  • రేపటి నుంచి కాలేజీల నిరవధిక బంద్
  • ఈ నెల 10 లేదా 11న పది లక్షల మందితో నిరసన
  • ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్య సమాఖ్య ప్రకటన

హైదరాబాద్, వెలుగు: కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు రూ.900 కోట్లు ఆదివారం నాటికి రిలీజ్ చేయాలని, లేదంటే 3వ తేదీ నుంచి నిరవధిక బంద్ నిర్వహిస్తామని ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల యాజమాన్య సమాఖ్య(ఫతి) చైర్మన్ రమేశ్ బాబు ప్రకటించారు. యూనివర్సిటీలు అన్ని పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. 

శనివారం హైదరాబాద్ లో ఫతి ట్రెజరర్ కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాలేజీలకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని అడిగితే విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెల 6న లక్షన్నర మంది కాలేజీ స్టాఫ్ తో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

ఈ నెల 10న లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్ లో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన అనంతరం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల ఇండ్లు, కలెక్టరేట్లను ముట్టడిస్తామన్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రైవేట్ కాలేజీపై విజిలెన్స్ విచారణ అంటే బ్లాక్ మెయిల్ చేయడమేనని పేర్కొన్నారు. 

ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల చెల్లింపు బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల నిరసనలతో ప్రభుత్వాలు పడిపోయాయని గుర్తుచేశారు. కాలేజీల యాజమాన్యాలను బెదిరించాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 3న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీలు చేపడుతున్న నిరవధిక బంద్ మద్దతు ఇస్తున్నట్టు ఏఐఎస్ఎఫ్ ప్రకటించింది.