ఈ వారం ఫెడ్ మీటింగ్‌‌‌‌ పై ఫోకస్‌‌‌‌..అమెరికాలో రేట్లు తగ్గే అవకాశం

ఈ వారం ఫెడ్ మీటింగ్‌‌‌‌ పై ఫోకస్‌‌‌‌..అమెరికాలో రేట్లు తగ్గే అవకాశం

న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్ ఫలితాన్ని ఆసక్తిగా గమనించనున్నాయి. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉండడంతో ఇండెక్స్‌‌‌‌లు పెరిగే చాన్స్ ఉంది. హోల్‌‌‌‌సేల్‌‌‌‌  ద్రవ్యోల్బణం డేటా, యూఎస్‌‌‌‌–ఇండియా  ట్రేడ్ చర్చలు మార్కెట్‌‌‌‌పై ప్రభావం చూపనున్నాయి. 

ఇవి ముఖ్యం

ఈ నెల 17న ఫెడ్ మీటింగ్ ఉంది.  అమెరికా ఉద్యోగాల డేటా బలహీనంగా ఉండటంతో కనీసం 25 బేసిస్ పాయింట్ల వడ్డీ తగ్గింపు ఉంటుందని మార్కెట్లు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. దేశీయ అంశాల్లో,  అమెరికా–ఇండియా ట్రేడ్ చర్చల్లో పురోగతి ఉంటే మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌ మెరుగవుతుంది. ఫారిన్‌‌‌‌ ఇన్‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌ఐఐలు) గత కొన్ని సెషన్లుగా నికర అమ్మకందారులుగా కొనసాగుతున్నారు. 

విదేశీ పెట్టుబడుల ఇన్‌‌‌‌ఫ్లోపై ట్రేడర్లు ఫోకస్ పెట్టాలి.  కాగా, కిందటి వారం  సెన్సెక్స్ 1,193.94 పాయింట్లు (1.47శాతం) పెరగగా,  నిఫ్టీ 373 పాయింట్లు (1.50శాతం) లాభపడింది.  నిఫ్టీ వరుసగా 8వ రోజూ లాభాన్ని నమోదు చేసింది.  సెన్సెక్స్ వరుసగా 5వ రోజూ పెరిగింది. 

ఎనలిస్టులు ఏమంటున్నారంటే?

“అమెరికా– ఇండియా ట్రేడ్ చర్చలు, ఎఫ్‌‌‌‌ఐఐల కదిలికలు మార్కెట్‌‌‌‌ డైరెక్షన్‌‌‌‌ను నిర్ణయిస్తాయి” అని  స్వస్తిక ఇన్వెస్ట్‌‌‌‌మార్ట్‌‌‌‌ ఎనలిస్ట్  సంతోష్ మీనా అన్నారు. ఫెడ్ రేట్లు తగ్గే అంచనాలతో గ్లోబల్ సెంటిమెంట్ బలంగా ఉందని ఎన్రీచ్ మనీ ఎనలిస్ట్ పొన్ముడి ఆర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. 

మోతిలాల్‌‌‌‌ ఓస్వాల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ సిద్ధార్థ ఖేమ్కా  మాట్లాడుతూ,  “జీఎస్‌‌‌‌టీ రేట్ల తగ్గింపు  ప్రభావంతో వినియోగం పెరగడం, ఫెడ్ రేట్లు తగ్గే అంచనాలు, ట్రేడ్ చర్చలపై ఆశలు..ఇవన్నీ  మార్కెట్‌‌‌‌ను నడిపిస్తాయి” అని అన్నారు.  రూపాయి-డాలర్ ట్రెండ్‌‌‌‌,  క్రూడ్ ఆయిల్ ధరలపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి  పెట్టాలని తెలిపారు.