కోల్‌కతా: బెంగాల్‌లోని నదియాలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో)గా పనిచేస్తున్న ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) డ్యూటీ ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తన సూసైడ్ నోట్‌లో స్పష్టం చేసింది. నదియాలోని కృష్ణానగర్‌కు చెందిన రింకు తరఫ్‌దార్(54 ) సమీప బంగాలీ స్వామి వివేకానంద స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తున్నారు. శనివారం ఆమె తన ఇంట్లోని ఓ గదిలో ఉరివేసుకున్నారు. కుటుంబసభ్యులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తరఫ్‌దార్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కు తరలించారు.
గదిలో సెర్చ్ చేయగా వారికి సూసైడ్ నోట్ లభించింది. " నేను చాలా సాధారణ మహిళను. జీతం చాలా తక్కువున్నా టీచర్ గా పనిచేస్తున్నా. నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయను. సర్ పని ఒత్తిడి వల్ల మానసికంగా బాధపడుతున్నాను. ఆ పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను" అని మహిళ తన సూసైడ్ నోట్ లో పేర్కొంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
