సాయిల్‌‌‌‌‌‌‌‌ టెస్టులను బట్టే ఎరువులు!

సాయిల్‌‌‌‌‌‌‌‌ టెస్టులను బట్టే ఎరువులు!

అడ్డగోలు వాడకాన్ని నియంత్రించడంపై కేంద్రం నజర్
నేల తీరును పరీక్షించే ల్యాబ్‌‌‌‌‌‌‌‌ల వివరాలు
అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆధ్వర్యంలో 12 ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు

నాలుగు మొబైల్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు
ఉమ్మడి జిల్లాల్లో తొమ్మిది ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు
ఒక ప్రాంతీయ ల్యాబొరేటరీ
పంట భూములు, సాయిల్టెస్టుల పరిస్థితి
రాష్ట్రంలో రైతుల సంఖ్య: సుమారు 58 లక్షలు

మొత్తం పంట భూములు: కోటీ 40 లక్షల ఎకరాలు
2017-18లో సాయిల్​ టెస్టులు చేసింది:2,51,704 శాంపిల్స్​
2018-19లోసాయిల్​ టెస్టులు చేసింది:79,590 శాంపిల్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగురైతుల భూములను సాయిల్​ టెస్టు చేసి, వాటి ఫలితాల ఆధారంగానే ఎరువుల పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అడ్డగోలుగా ఎరువులు, పురుగుమందుల వాడకంతో వ్యవసాయ భూములు కలుషితమైపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పంట భూముల స్వభావాన్ని బట్టి ఏయే ఎరువులు, ఎంత మోతాదులో వాడాలో నిర్ధారిస్తారు. వాటి ఆధారంగానే ఎరువులు పంపిణీ చేస్తారు. అతిగా ఎరువుల వాడకాన్ని నియంత్రించేందుకు ఎరువుల సబ్సిడీపైనా కేంద్రం కోత విధించింది.

రసాయనాలు పెరిగిపోయి..

దేశంలో హరిత విప్లవం నాటి నుంచి ఎరువుల వినియోగం పెరిగింది. దానివల్ల పంటల ఉత్పత్తి బాగా పెరిగినా.. అవసరానికి మించి, అడ్డగోలుగా ఎరువులు, పురుగు మందుల వాడకం ఎక్కువైంది. దీనివల్ల ఇటు పంటల్లో రసాయనాల అవశేషాలు పెరిగిపోవడంతోపాటు అటు పంట భూములు కూడా కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. ప్రతి రైతు భూమికి సాయిల్​ టెస్టులు చేయించాలని, ఏయే పోషకాలు అవసరమో గుర్తించి, అవే ఎరువులు వాడాలని సూచించింది. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

సబ్సిడీలో కోత

దేశవ్యాప్తంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తామని కేంద్రం బడ్జెట్​ ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. ఎరువుల సబ్సిడీకి కోత వేసింది. 2019–20 బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి రూ.80,035 కోట్లు ఇచ్చిన కేంద్రం.. తాజాగా 2020–21 బడ్జెట్లో రూ.71,345 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే గతంతో పోలిస్తే రూ. 8,690 కోట్లు (పది శాతం) తక్కువ. సాయిల్​ టెస్టుల ఆధారంగానే ఎరువులు పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ చర్యల వల్ల ఎరువుల వాడకం తగ్గడంతోపాటు సబ్సిడీ భారం తగ్గుతోందని పేర్కొంది.

ఎరువుల కోటా తగ్గే చాన్స్

రాష్ట్రంలో ఖరీఫ్, రబీ రెండు సీజన్లు కలిపి ఏటా 35 లక్షల టన్నుల ఎరువులను కేంద్రం సరఫరా చేస్తోంది. ఇందులో ఖరీఫ్​లో 20 లక్షల టన్నులు, యాసంగిలో 15 లక్షల టన్నులను సబ్సిడీపై అందజేస్తోంది. కేంద్రం సబ్సిడీకి కోత పెట్టడంతో.. వచ్చే ఏడాది నుంచి ఎరువుల కేటాయింపులు తగ్గే చాన్స్​ ఉందని అధికారులు చెబుతున్నారు. అందులోనూ యూరియా, ఇతర ఎరువుల్లో ఏవి ఎంత కేటాయిస్తారన్న దానిపైనా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో ఎరువుల వాడకాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అంటున్నాయి.

అంతటా సాయిల్​ టెస్టులు చేసేదెట్ల?

రాష్ట్రంలో 58 లక్షల మందికిపైగా రైతులు సుమారు కోటీ 40 లక్షల ఎకరాల మేర భూముల్లో సాగు చేస్తున్నారు. ఆ పంట భూముల్లో నేలల స్వభావం, ఖనిజాలు, ధాతు లోపాలు, ఏ ఎరువులు వేస్తే మంచి దిగుబడి వస్తుంది, ఏ పంటలకు అనుకూలం అన్నదానిని సాయిల్​ టెస్టుల ద్వారా తేల్చాలి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,050 మినీ ల్యాబ్‌‌‌‌‌‌‌‌ లు, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఆధ్వర్యంలో 12, ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ఒక్కో ల్యాబ్‌‌‌‌‌‌‌‌ చొప్పున 9 ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. మరో నాలుగు మొబైల్‌‌‌‌‌‌‌‌ ల్యాబ్‌‌‌‌‌‌‌‌లు పనిచేస్తున్నాయి. ఒక ప్రాంతీయ ల్యాబొరేటరీ కొనసాగుతోంది. కానీ వ్యవసాయ కార్యాలయాల్లో స్థలం లేక, సరైన వసతుల్లేక చాలా చోట్ల మినీ ల్యాబ్​లు మూలకుపడ్డాయి. పెద్ద ల్యాబ్​ల్లోనూ సిబ్బందిలేక, కావాల్సిన ఎక్విప్​మెంట్​ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పంట భూములన్నింటినీ సాయిల్​ టెస్టులు చేయడం ఎట్లాగన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉన్న ల్యాబ్​లను ఆధునీకరించడంతోపాటు, ప్రతి మండలానికి ఒక పూర్తిస్థాయి ల్యాబ్​ ఏర్పాటు చేస్తే మేలని వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు చెప్తున్నారు. సాయిల్​ టెస్టులను కంపల్సరీ చేస్తే.. ఎప్పటికి టెస్టులు పూర్తవుతాయి, ఎరువులు ఎప్పుడిస్తారన్న ఆందోళన కనిపిస్తోంది.