ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత : గులాం నబీ ఆజాద్

ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత : గులాం నబీ ఆజాద్

భర్త జైల్లో ఉంటే కుటుంబ పరిస్థితి ఏమిటి?: ఆజాద్

బిల్లును మోడీ సర్కార్​ అసమగ్రంగా రూపొందించిందని, కొన్ని క్లాజ్​ల వల్ల ముస్లిం వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందని రాజ్యసభలో కాంగ్రెస్​పక్ష నేత గులాం నబీ ఆజాద్​ అన్నారు. సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీని వల్ల భార్య భర్తలు న్యాయ వివాదాల్లో చిక్కుకుంటారని, ఇద్దరూ లాయర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. లాయర్లకు ఫీజులు కట్టేందుకు సొంత భూముల్ని కూడా అమ్ముకోవాల్సి వస్తుందేమోనని అన్నారు. సివిల్​ వివాదాన్ని క్రిమినల్​ నేరంగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ భర్త జైలు పాలైతే భార్యకు భరణం ఎలా చెల్లిస్తాడని ఆయన ప్రశ్నించారు.

ఈ చట్టం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయన్నారు. భర్తలు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత దొంగలు గానో, బందిపోట్లు గానో మారాలన్నదే బిల్లు ఉద్దేశంలా కనిపిస్తోందని  విమర్శించారు. ట్రిపుల్​ తలాక్​ నిషేధానికి తాము వ్యతిరేకం కాదని, బిల్లులోని క్రిమినల్​ క్లాజ్​ను తొలగించాలని డిమాండ్​ చేస్తున్నామని చెప్పారు. బిల్లును సెలెక్ట్​ కమిటీకి పంపాలని పట్టుబట్టారు. బిల్లు వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని, ఓటు బ్యాంకు కోసం బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చర్చలో పలువురు సభ్యులు తమ వాదనను వినిపించారు. ముస్లిం మహిళలకు టికెట్లు ఇవ్వని పార్టీ మహిళా సాధికారత గురించి మాట్లాడటం ఏమిటని బీజేపీపై ఆప్​ ఎంపీ సంజయ్ సింగ్ మండిపడ్డారు.