దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు

దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు

దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో 22 ఏళ్ల యువతికి మంకీపాక్స్ సోకింది. మంకీపాక్స్ లక్షణాలతో లోక్నాయక్ జయప్రకాష్ ఆస్పత్రిలో చేరిన యువతికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఢిల్లీలో ఇప్పటి వరకూ మొత్తం ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం నలుగురు చికిత్స పొందుతున్నారు. 

మంకీపాక్స్ అంటే ఏమిటీ ..?

మంకీపాక్స్ అనేది తేలికపాటి వైరస్. మశూచి లాంటిదే మంకీపాక్స్ కూడా. ఇది తొలిసారి 1958లో పరిశోధనల్లో భాగంగా కోతుల నుంచి ఈ వ్యాధిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరుపెట్టారు.1970లో మొదటిసారి మనుషుల్లో ఈ వ్యాధి కనిపించింది. 2003లో అమెరికాలో ఈ వ్యాధిని మనుషుల్లో గుర్తించారు. 2018లో ఈ వ్యాధి ఇజ్రాయెల్, బ్రిటన్ లకు చేరింది.

మంకీపాక్స్ లక్షణాలు

మంకీపాక్స్ వ్యాధి సోకితే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కన్పిస్తాయి. ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా ఇవి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ లక్షణాలు 2 నుంచి 4  వారాలపాటు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో చాలామంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

మంకీపాక్స్ ఎలా సోకుతుంది..?

మంకీపాక్స్ సోకిన జంతువు కరవడం, రక్తం, శరీర ద్రవాలు, జంతువుల యొక్క జుట్టును తాకడం ద్వారా ఈ వ్యాధి మనుషులకు సోకవచ్చు. ఇది ఎలుకలు, ఉడుతలు వంటి వాటి ద్వారా కూడా మనుషులకు వ్యాపిస్తుందని వైద్యులు తెలిపారు. వ్యాధి సోకిన జంతువు నుండి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం ద్వారా కూడా ఈ వ్యాధి మనుషులకు సోకే అవకాశం ఉంది. దద్దుర్లు ఉన్నవారు ఉపయోగించే దుస్తులు, పరుపు, దుస్తులను తాకడం ద్వారా మరొకరికి సోకుతుంది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారు చనిపోయే అవకాశాలు తక్కువే. చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది.