ఎట్లున్నరని వచ్చి చూడట్లే ఎవరూ పట్టించుకోవట్లే

  ఎట్లున్నరని వచ్చి చూడట్లే  ఎవరూ పట్టించుకోవట్లే

” మనిషిలోతు నీళ్లలో మునిగిపోయినం. ఎవరైనా వచ్చి సాయం చేస్తారని చూసినం. ఎవరూ రాలేదు. అర్ధరాత్రి పిల్లల్ని భుజాన వేసుకుని ఈదుకుంటూ బయటపడ్డం. ఇప్పటికి అడుగుల్లోతు నీళ్లున్నయ్​. రెస్క్యూ టీం వాళ్లు కూడా సహాయక చర్యలు చేపట్టలేదు. నీళ్లు తీసేందుకు ప్రయత్నిస్తలేరు.  దాదాపు 50రోజుల పైనే అయితుంది. మేం ఎట్లున్నం అని ఒక్కరు కూడా వచ్చి చూడలేదు. పిల్లల్ని పెట్టుకుని నీళ్లలోనే బతుకుతున్నం. ఏ రాత్రి ఏ పామొస్తదో, ఏ పురుగు కుడతదో అని భయంతో చస్తున్నం.. మా గోసను ఎవరూ పట్టించుకోవడం లేదు’’.. అంటూ నాగోల్ పరిధి హునుమాన్ నగర్ లో ఉండే ఇల్లాలి ఆవేదన ఇది.

హైదరాబాద్, వెలుగుసిటీలో వరదలు వచ్చి పోయి 50 రోజులు దాటుతున్నా ఇంకా ఎఫెక్టెడ్​ఏరియాల్లో బాధితులకు కష్టాలు తొలగిపోవడం లేదు.  చాలా ప్రాంతాల్లోని కాలనీల్లో వరదనీళ్లు, బురద, చెత్త అలాగే ఉన్నాయి. ఎమ్మెల్యే, కార్పొరేటర్, నాయకులు ఎవరైనా వెళ్లి మేమున్నామనే భరోసా కల్పించలేదు. ఇప్పటికీ అల్ జుబైల్ కాలనీలో బురద పేరుకు పోయి ఉంది. నాగోల్ లోని అయ్యప్య కాలనీలో చెత్త చెదారం, హనుమాన్ నగర్ లో నీళ్లు అలాగే ఉన్నాయి. ఇలా అనేక ప్రాంతాల్లో వరద పరిస్థితుల్లో ఎలాంటి మార్పులేదు.  ఏ నాయకుడు వచ్చి చూడలేదని, తమను పట్టించుకోవడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదివేల నష్టపరిహారం ఇస్తున్నప్పటికీ అవి అందాల్సిన వాళ్లకు కాకుండా వేరేవాళ్లకు ఇచ్చారని బాధితులు వాపోతున్నారు. నిత్యవసర వస్తువులు, సామాన్లు పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నా కనీసం తమ పరిస్థితి వినేవారు లేరని గోడు వెల్లబోసుకుంటున్నారు.

ఎవరూ పట్టించుకోవట్లే..

ఎలక్షన్లు వస్తే గల్లీల్లో ఉన్న ఇళ్లు కూడా వెతుక్కుంటూ పోయేటోళ్లు, ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నామని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నారు. నిలువ నీడలేక, ఉన్నవన్ని వరదల్లో పోగొట్టుకుని నిస్సహాయస్థితిలో ఉన్నామని, కనీసం తిండిపెట్టేవాళ్లు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పహాడీషరీఫ్ లోని ఉస్మాన్ నగర్ బస్తీ, హునుమాన్ నగర్, అయ్యప్పకాలనీ, ఇంకా పలు కాలనీల్లో వరద నీరు అలాగే ఉన్నా ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడంలేదు. కాలనీల వాసులే తమకు తాముగా సాయం చేసుకుంటున్నామని,  సర్కార్​ నుంచి ఎలాంటి సాయం అందడం లేదని చెబుతున్నారు. ఫలక్ నుమాలోని అల్ జుబైల్ కాలనీలో ఇళ్లన్ని ఇప్పటికి అడుగులోతు పేరుకుపోయిన బురద, చెత్తాచెదారం తో ఉన్నాయి. స్థానిక ఎన్జీవోలు, సోషల్ వర్కర్స్ జేసీబీలు, ట్రాక్టర్ల ద్వారా క్లీన్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పుడోఒకసారి వచ్చి బురద తీసుకుపోతున్నారని అంటున్నారు. వరదనీళ్లు ఉన్న కాలనీల్లో జనాలు ఇళ్లపై టెంట్లు వేసుకుని ఉంటున్నారు. రాత్రైతే పాములు వస్తున్నాయంటున్నారు. చలి కారణంగా అనారోగ్యాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు.

ఆడవాళ్లని కూడా చూడకుండా తిట్టారు

కాలనీ అంతటా నీళ్లు పారుతున్నాయి. బయటకు వెళ్లడానికి కూడా వీలులేదు. మేం లోపలికి ఉన్నా మని కనీసం ఫుడ్ ప్యాకెట్లు ఇచ్చేం దుకు కూడా ఎవరూ రాలేదు. వండు కోవడానికి లేదు, బయటకు పోవడా నికి లేదు.  పై అంతస్తులో ఉండేవాళ్లు వండి ఇస్తే అది తిని పొట్టనింపు కున్నాం.  నష్టపరిహారం  మా వరకు రానివ్వలేదు. ఆడోళ్లంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేదు. ఇష్టమొచ్చినట్లు తిట్టి ర్రు. మేం 3 రోజులు వెయిట్ చేస్తే అప్పుడు వచ్చి రైస్ బ్యాగ్ తిట్టుకుంటూ ఇచ్చి పోయినరు.   ‑ నవనీత, అల్లంతోట బావి

ఇంటిమీద టెంటు వేసుకుని ఉంటున్నం

మిమ్మల్ని చెరువులో ఎవరు ఇల్లు కట్టుకోమన్నారని ప్రశ్నిస్తున్నారు.  మాకు లోన్లు ఎలా ఇచ్చారు. చిన్న పని కావాలంటే పర్మిషన్ కావాలి. మరి ఇల్లు కట్టుకునేటప్పుడు అంతకన్నా ఎక్కువ పర్మిషన్లు ఉంటాయి కదా. ఎంతమందికి మొరపెట్టుకున్నా, ఎన్నిరకాలుగా అడిగినా మాకు న్యాయం జరగడంలేదు. ఇంట్లోకి నీళ్లొస్తే పైన టెంటు వేసుకుని మిగిలిన సామాను తీసుకుని ఉంటున్నం. మురుగువాసనకి అన్నం కూడా తినబుద్ధికావట్లేదు. చాలా కష్టమైతంది.

– మంగ, హనుమాన్ నగర్ కాలనీ