వడ్లు ఆరబెట్టే విషయంలో గొడవ.. తండ్రిని చంపిన కొడుకు

వడ్లు ఆరబెట్టే విషయంలో గొడవ.. తండ్రిని చంపిన కొడుకు
  • బండరాయితో తలపై కొట్టి హత్య
  • పెద్దపల్లి జిల్లా పూసాలలో విషాదం

సుల్తానాబాద్, వెలుగు: వడ్లు ఆరబెట్టే విషయం లో తండ్రీకొడుకుల మధ్య జరిగిన గొడవ ప్రాణం తీసే వరకూ వెళ్లింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల పీఏసీఎస్​ వడ్ల కొనుగోలు సెంటర్ లో  శుక్రవారం ఈ దారుణం జరిగింది. సీఐ జగదీశ్​  కథనం ప్రకారం..పూసాల వడ్ల సెంటర్ వద్ద పోసిన వడ్లను శుక్రవారం తీగల నర్సయ్య (65), ఇతడి కొడుకు రాజేశం ఆరబెట్టేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తాను వడ్లు ఆరబెట్టనంటూ రాజేశం అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, రాజేశం వెళ్లకుండా అతడి సైకిల్​కు నర్సయ్య తాళం వేశాడు. కోపోద్రిక్తుడైన రాజేశం తండ్రిని నెట్టేసి అక్కడే ఉన్న బండతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే కన్నుమూశాడు.

మృతుడు భార్య భూదేవి ఫిర్యాదు మేరకు రాజేశంపై కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇందులో రాజేశం పెద్ద కొడుకు. జూలపల్లి మండలం కాచాపూర్​కు చెందిన నర్సయ్య కుటుంబం చాలా యేండ్ల కిందటే వలస వచ్చి పూసాలలో వ్యవసాయం చేసుకుంటోంది. గతంలో కాచాపూర్ లో జరిగిన ఓ హత్య కేసులోనూ రాజేశం నిందితుడిగా ఉండగా, కేసు కొట్టివేశారు. సంఘటన స్థలాన్ని సీఐ జగదీశ్​, ఎస్ఐలు అశోక్ రెడ్డి, వినీత పరిశీలించారు.