గాంధీ మెడికల్ కాలేజీ​లో.. మెడికోలు వర్సెస్ హెచ్​వోడీ

గాంధీ మెడికల్ కాలేజీ​లో.. మెడికోలు వర్సెస్ హెచ్​వోడీ
  • పోలీస్​ స్టేషన్​దాకా వెళ్లిన గొడవలు 
  • వేధిస్తున్నారని డీఎంఈకి మెడికోల ఫిర్యాదు
  • అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్​లో హెచ్​వోడీ కంప్లైంట్

హైదరాబాద్, వెలుగు: గాంధీ మెడికల్ కాలేజీలో కొంత మంది మెడికోలు, ఓ లేడీ ప్రొఫెసర్(హెచ్​వోడీ) మధ్య జరుగుతున్న గొడవ తారా స్థాయికి చేరింది. ప్రొఫెసర్ తమను మాటలతో వేధిస్తున్నదని, ఆమె కారణంగా తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని పీజీలు గాంధీ మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్‌‌గా ఉన్న డీఎంఈ రమేశ్‌‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రొఫెసర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని కంప్లైంట్‌‌ లెటర్‌‌‌‌లో పేర్కొన్నారు. దీంతో సదరు ప్రొఫెసర్‌‌‌‌కు డీఎంఈ షోకాజ్ నోటీసులివ్వగా, ఆమె డీఎంఈకి వివరణ ఇచ్చారు. ఇంతటితో ఆగకుండా లేడీ ప్రొఫెసర్ పోలీసులను ఆశ్రయించారు. కరికులమ్‌‌లో ఉన్న డ్యూటీలు చేయాలని, చదువుకోవాలని చెబితే ఆత్మహత్య చేసుకుంటామని మెడికోలే తనను ఎమోషనల్ బ్లాక్‌‌ మెయిల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

8 మంది స్టూడెంట్స్ తనపై అనవసర ఆరోపణలు చేస్తూ పరువు తీస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్‌‌లో పేర్కొన్నారు. ఇందులో ఇద్దరు మేల్, ఆరుగురు ఫీమేల్ మెడికోలు ఉన్నారు. ప్రొఫెసర్ కంప్లైంట్ మేరకు ఎంక్వైరీకి రావాలని మెడికోలకు పోలీసులు ఫోన్లు చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన మెడికోలు.. శుక్రవారం మళ్లీ డీఎంఈ రమేశ్‌‌ రెడ్డిని ఆశ్రయించారు. తమ హెచ్‌‌వోడీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొఫెసర్ ఇచ్చిన కంప్లైంట్‌‌పై ఎంక్వైరీ చేసేందుకు పోలీసులు తమను స్టేషన్‌‌కు పిలుస్తున్నారని, తమ భవిష్యత్‌‌ పాడవుతుందని స్టూడెంట్స్ డీఎంఈ వద్ద ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ విషయాన్ని హెల్త్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లానని, ప్రొఫెసర్‌‌‌‌పై సెక్రటరీ చర్యలు తీసుకుంటారని స్టూడెంట్స్‌‌కు డీఎంఈ తెలిపారు. ప్రొఫెసర్‌‌‌‌పైనే పోలీసు స్టేషన్‌‌లో కంప్లైంట్ చేయాలని వారికి డీఎంఈ సూచించినట్టుగా తెలిసింది.

వాట్సాప్ గ్రూపులో రచ్చ

మెడికోలకు, ప్రొఫెసర్​కు మధ్య కొన్ని నెలలుగా గొడవ జరుగుతున్నదని గాంధీ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్‌‌‌‌ ఒకరు ‘వెలుగు’కు చెప్పారు. ఈ గొడవకు సంబంధించి డిపార్ట్‌‌మెంట్ వాట్సాప్‌‌ గ్రూపులో జరిగిన చాటింగ్, ఫిర్యాదు కాపీలను ఆయన వెలుగుకు అందజేశారు. తన డిపార్ట్‌‌మెంట్‌‌లో పనిచేస్తున్న ఇద్దరు మెడికోలను తన బిడ్డల తీరుగా చూసుకున్నానని, వాళ్లు మాత్రం తనను అసభ్యంగా తాకుతూ వేధించారని ఆవేదన వ్యక్తం చేస్తూ లేడీ ప్రొఫెసర్ వాట్సప్‌‌ గ్రూపులో పోస్ట్ చేశారు. తప్పు అయిందని సారీ చెబితే, ఏమీ యాక్షన్ తీసుకోకుండా వదిలేశానని కూడా ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు. అయినా, తన పరువుకు భంగం కలిగేలా తప్పుడు ఆరోపణలు చేస్తుండడంతోనే పోలీసులకు కంప్లైంట్ చేసినట్టుగా ప్రొఫెసర్ తన పోస్టులో వివరించారు.
 ప్రొఫెసర్ తిడుతున్నప్పుడు రికార్డు చేసిన వీడియోలు, ఆడియోలు మెడికోలు డీఎంఈకి అందజేసినట్టు తెలిసింది.

సర్కార్ నిర్లక్ష్యం

రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంలో సుమారు 8 మంది మెడికోలు ఆత్మహత్యకు యత్నించారు. వరంగల్ మెడికో ప్రీతి ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి చేసిన కంప్లైంట్‌‌ను హెచ్‌‌వోడీ, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్‌‌ సీరియస్‌‌గా తీసుకోకపోవడం వల్లే ఆమె సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఏకంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌‌‌‌ రమేశ్‌‌ రెడ్డి ప్రిన్సిపాల్‌‌గా ఉన్న గాంధీ కాలేజీలోనే ప్రొఫెసర్‌‌‌‌కు, మెడికోలకు మధ్య నెలల తరబడిగా రచ్చ జరుగుతున్నది. ఈ క్రమంలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయని స్టూడెంట్స్‌‌ చెప్పడం, స్టూడెంట్స్ తనను అసభ్యంగా తాకారని ప్రొఫెసర్ ఆరోపించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అయినా, ఇప్పటి దాకా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు జరగలేదు.