గద్వాల బాల గాయకుడి పాట వెనుక ఎన్ని బాధలో..!

గద్వాల బాల గాయకుడి పాట వెనుక ఎన్ని బాధలో..!

పల్లె యాసతో పాటలు పాడుతూ జనం గుండెల్లో చోటు సంపాదిస్తున్నాడు ఓ బాలగాయకుడు. తన గాత్ర మాధుర్యంతో జానపదాలు, తత్వాలు, పాటలు పాడుతూ ప్రశంసలందుకుంటున్నాడు. 9 ఏళ్ల ప్రాయంలో రాష్ట్ర, జాతీయ స్థాయి పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచాడు. గద్వాల జిల్లాకు చెందిన బాల గానగంధర్వుడు సాయికుమార్ కుటుంబ నేపథ్యం, ఎత్తు పల్లాలు, జీవిత లక్ష్యాలపై వీ6 స్పెషల్ స్టోరీ.

ఈ పిల్లవాడి పేరు సాయి కుమార్. స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట అనే చిన్న గ్రామం. సాయి కుమార్ నోటి వెంట పాట మొదలైదంటే చాలు... తోటి విద్యార్థులు, టీచర్లే కాదు ఊరి జనమంతా ఆ బాలుడి చుట్టూ చేరిపోతారు. సాయి నోటి గుండా ప్రవాహంలా సాగే పాట కోకిల గానం విన్నంత హాయిగా ఉంటుంది. బడిలో టీచర్లు చెప్పే పాఠాలే తప్ప మరో ప్రపంచం తెలియని సాయికుమార్ ... బాల్యంలోనే జానపదాలు, తత్వాలను అవలీలగా కంఠస్తం చేసి పాడుతుంటే ప్రశంసించని వారుండరు. సాయిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన తాటికుంట హై స్కూల్ టీచర్ లక్ష్మీ నారాయణ ఆ విద్యార్థిని ప్రోత్సహించాడు. కవి అవనీ శ్రీ కృషితో సోషల్ మీడియా ద్వారా సాయి కుమార్ ప్రతిభ రాష్ట్రం నలుమూలలకు పాకింది. రాష్ట్ర స్థాయి పాటల పోటీలో మొదటి బహుమతి సాధించాడు సాయికుమార్. జాతీయ స్థాయి పాటల పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. భజన పాటలు, కాలజ్ఞాన తత్వాలు, సినిమా పాటలు, జానపదాలు పాడతాడు.

నోటి మాట కూడా రాకుండే.. అంజన్న భజనల్లో మాట

సంగీతంలో ఓనమాలు తెలియని ఈ బాలుడి కంఠస్వరం విన్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. సంగీత ప్రియులు సైతం సాయి పాటకు ఫిదా అవుతున్నారు.  సాయి నోటి వెంట పలికిన జ్ఞానికె ఎరుక... అన్న పాట ఎంతో మంది మేధావులను ఆలోచనలో పడేసింది. పల్లెటూరి పిల్లగాడ - పసుల గాసె మొనగాడ పాట ... వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉంటుంది. ఇలా సాయి కుమార్ ఏ పాట అందుకున్నా... ఏ జానపదం ఊసేత్తినా.. ఏ తత్వాన్ని ఆలపించినా నీటి ప్రవాహంలా సాగుతూనే ఉంటుంది. అయితే సాయికుమార్ కుటుంబానిది హృదయ విదారకరమైన గాథ. సాయి కుమార్ పుట్టుకతోనే అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. నాలుగేళ్లు నిండినా .. తమ పిల్లవాడి నోట వెంట మాటరాలేదన్న వేదన కన్నవారిని ఎంతగానో కుంగదీసింది. సాయికుమార్ నోరు తెరిచి మాట్లాడాలని... తిరగని ఆసుపత్రంటూ లేదు. మొక్కని దేవుడు లేడు. మాట వస్తుందన్న నమ్మకం లేదు. దేవునిపై భారం వేసారు. ఊళ్లో ఆంజనేయస్వామి ఆలయంలో భజనలు జరిగితే తండ్రి ధనుంజయ్ తన కుమారుడు సాయిని తీసుకెళ్లే వాడు. అలా భజనలు, పాటలు, తత్వాల ధ్వనులు సాయిలోకి ప్రవేశించి మాటతోపాటు పాటను పలికిస్తున్నాడు.

సాయి వైద్యం కోసం లక్షల్లో అప్పు

సాయికుమార్ వైద్యం కోసం ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చయ్యాయి. సాయి తండ్రి ధనుంజయ్ కు  ఆస్తిపాస్తులు లేవు. ఉన్న ఎకరా భూమి లిఫ్ట్ కింద మునిగిపోయింది. కౌలు వ్యవసాయం నష్టాలు తెచ్చింది. అనారోగ్య సమస్యలు కుటుంబాన్ని వెంటాడాయి. దీంతో అప్పుల బాధతాళలేక ధనుంజయ్ దంపతులు తమ ఇద్దరు పిల్లలను ఇంటి దగ్గరే వదిలి పట్నానికి వలస వెళ్లారు. చిన్నపాటి రేకుల గదిలో ప్రస్తుతం ఈ పిల్లలు నివసిస్తున్నారు. అప్పుకు వడ్డీలైనా కట్టాలన్న ఆలోచనతో సాయికుమార్ తల్లిదండ్రులు పట్నంలో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. సాయి, అతని అక్క ఇంట్లో వంట చేసుకుని రోజు బడికి వెళ్లి చదువుకుంటారు. సెలవు దినాల్లో కూలీ పనికి వెళ్తున్నారు ఈ చిన్నారులు. అలా వచ్చే కూలీ డబ్బులే వారం రోజుల ఆకలిని తీర్చేది. ఉబికి వచ్చే దు:ఖాన్ని సైతం దిగమింగుకుని భవిష్యత్తుపై కలలుగంటూ సమస్యలపై పోరాటం చేస్తున్నారు చిన్నారులు.