ప్రభుత్వంలో పైచేయి కోసం తాలిబాన్‌ గ్రూప్‌ల కొట్లాట 

ప్రభుత్వంలో పైచేయి కోసం తాలిబాన్‌ గ్రూప్‌ల కొట్లాట 
  • అధికారం కోసం తాలిబాన్‌లు, హక్కానీల కుమ్ములాట 
  • గెలుపు క్రెడిట్ మాదే.. మాకే ఎక్కువ పవర్ కావాలంటూ గొడవలు 
  • బరాదర్ వెనక ఖతార్.. హక్కానీ వెనక చక్రం తిప్పుతున్న పాకిస్తాన్​

కాబూల్: అఫ్గానిస్తాన్ లో కేవలం ఏడు రోజుల్లోనే కలిసికట్టుగా సర్కారును కూల్చేసిన తాలిబాన్లు, హక్కానీలు.. అధికారం విషయం వచ్చేసరికి మొదటి నుంచీ గొడవపడుతూనే ఉన్నరు. ఘనీ సర్కారును కూల్చివేసి దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో క్రెడిట్ తమదంటే.. తమదేనంటూ రెండు వర్గాలు వాదులాటలకు దిగుతున్నాయి. పాకిస్తాన్​ ఐఎస్ఐ చీఫ్​ జోక్యంతో కొంత రాజీపడి మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, పవర్ షేరింగ్​పై రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నయి. ప్రభుత్వంలో తమకే ఎక్కువ పవర్ కావాలంటూ తన్నుకునేదాకా పోతున్నాయి. ఆగస్టు 15న కాబూల్​ను స్వాధీనం చేసుకుని, ప్రెసిడెంట్ ప్యాలెస్​లోకి ఎంటరైన తాలిబాన్లు దేశాన్ని తమ కంట్రోల్​లోకి తీసుకున్నారు. అధికారులను లంచాలతో కొని, పోరాటం లేకుండానే దేశమంతా చేజిక్కించుకున్నారు. కానీ అధికార పంపిణీలో తాలిబాన్లు, హక్కానీల మధ్య కొట్లాటలు మొదలైనయ్. 
గెలుపు క్రెడిట్, పవర్ కోసమే.. 
తాలిబాన్లు, హక్కానీల మధ్య ప్రధానంగా గెలుపు క్రెడిట్, పవర్ షేరింగ్ అంశాలపైనే కుమ్ములాటలు మొదలయ్యాయి. తాలిబాన్ల పొలిటికల్ లీడర్, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్, హక్కానీ నెట్ వర్క్ చీఫ్ ​సిరాజుద్దీన్ హక్కానీ క్యాంపుల మధ్య మొదలైన ఈ గొడవలు తన్నుకునేదాకా పోయాయి. ఖతార్ రాజధాని దోహా కేంద్రంగా తాను అప్పటి ప్రెసిడెంట్ ట్రంప్​తో మాట్లాడి, శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నందుకే.. నాటో బలగాలు వెళ్లిపోయి, అఫ్గాన్ తమ వశం అయిందని బరాదర్ వాదిస్తున్నాడు. తమ పోరాటం వల్లే అమెరికా సేనలు వెళ్లిపోయాయని, దేశాన్ని చేజిక్కించుకున్నామంటూ సిరాజుద్దీన్ చెప్తున్నాడు.  
బరాదర్ పై కాల్పుల కలకలం 
ప్రభుత్వ ఏర్పాటుకు ముందే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో బరాదర్, సిరాజుద్దీన్ సమక్షంలోనే రెండు వర్గాల వారు తన్నుకున్నారు. ఈ సమయంలో హక్కానీ వర్గం వాళ్లు బరాదర్​పై కాల్పులు జరిపారని, ఆయన చనిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. ఈ గొడవ తర్వాతే పాక్ ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ హమీద్​ హుటాహుటిన కాబూల్ కు వచ్చి రెండు గ్రూపులకు నచ్చచెప్పి, మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు దిశగా పావులు కదిపారు. 
వెనకుండి నడిపిస్తున్న ఖతార్, పాక్​..
తాలిబాన్, హక్కానీ నేతలను తెరవెనుక నుంచి ఖతార్, పాక్ నడిపిస్తున్నాయి. హక్కానీ నెట్ వర్క్​కు పాక్ ఐఎస్ఐ పూర్తిస్థాయిలో మద్దతిస్తోంది. హక్కానీల ఆధిపత్యంతో కూడిన ప్రభుత్వం ఏర్పా టు ద్వారా అఫ్గాన్​ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. కొత్త తాలిబాన్ సర్కార్ ఏర్పాటు దిశగా బరాదర్​కు ఖతార్ తెరవెనక సహాయం చేస్తోంది. అమెరికాతో చర్చలు మొదలు కొని, తాలిబాన్లకు వివిధ దేశాల మద్దతు సాధించడం వెనక కీలక పాత్ర పోషిస్తోంది. బరాదర్​ను 2010లో పాకిస్తాన్ అరెస్ట్ చేసి, రెండేళ్లు జైలులో ఉంచిన కారణంగా, అతనికి పాక్​, ఐఎస్ఐతో బలమైన సంబంధాలు లేవు.

ఇండియన్ వ్యాపారి కిడ్నాప్
కాబూల్​లో మంగళవారం రాత్రి తాలిబాన్లు బన్సూరి లాల్ అనే ఇండియన్ ఆరిజిన్ వ్యాపారిని కిడ్నాప్ చేశారని అకాలీ దళ్ నేత మంజీందర్ సిర్సా ట్విట్టర్​లో వెల్లడించారు. లాల్ కిడ్నాప్ వ్యవహారంపై ఆయన కుటుంబ సభ్యులతో, కాబూల్​లోని హిందూ, సిక్కు కుటుంబాలతో మాట్లాడినట్లు తెలిపారు. అఫ్గాన్​లో హిందూ, సిక్కుల భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మంగళవారం రాత్రి బన్సూరి లాల్ (50) అనే హిందూ వ్యాపారి తన ఇంటికి వెళ్తుండగా, ఐదుగురు తాలిబాన్లు గన్స్ తో బెదిరించి, కారులో తీసుకెళ్లారు. లాల్ సేఫ్ గా తిరిగి వచ్చేలా సహాయం చేయాలంటూ ఆయన సోదరుడు, ఇతరులు కోరారు. లాల్ ను విడిపించడంలో సాయం చేయాలని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను” అని సిర్సా పేర్కొన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

లేడీ ఫుట్​బాల్​ ప్లేయర్లు పారిపోయిన్రు..
అఫ్గానిస్తాన్ తరఫున ఫుట్ బాల్ గేమ్ లో వివిధ విభాగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న విమెన్ టీం సభ్యులు పాకిస్తాన్ కు పారిపోయారు. తాలిబాన్ల పాలనలో తమ ప్రాణాలకు భద్రత లేదని, బుర్ఖాలు ధరించి అఫ్గాన్ బార్డర్ దాటారు. గత నెల నుంచే జూనియర్ ప్లేయర్ల టీంతో పాటు కోచ్ లు, వారి ఫ్యామిలీలు అఫ్గాన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కాబూల్ ఎయిర్ పోర్టులో జరిగిన బాంబు దాడులతో వారు మిన్నకుండిపోయారు. తాజాగా అండర్ 14, 16, 18 టీం మెంబర్లతో  పాటు వారి ఫ్యామిలీలు మొత్తం 75 మందికి పైగా మంగళవారం బార్డర్ దాటి పాక్ లోని లాహోర్ కు చేరుకోగా అక్కడ వారికి పూల దండలతో స్వాగతం పలికారు.