అగ్రికల్చర్, సివిల్ సప్లై శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ

అగ్రికల్చర్, సివిల్ సప్లై శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ
  • ఏ ఒక్క పోస్టు ఖాళీ లేకుండా భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం

హైదరాబాద్: రైతులకు సమగ్రంగా శిక్షణ ఇవ్వడానికి కావాలసిన అన్ని సౌకర్యాలను వ్యవసాయ శాఖ కల్పించాలని, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యానవన శాఖను పూర్తిస్థాయిలో క్రియాశీలకంగా మార్చాలని అందుకు అవసరమైన రీతిలో అధికారులను నిపుణులను జోడించి నిరంతరంగా రైతులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. 
పౌర సరఫరాల శాఖతోపాటు వ్యవసాయ శాఖలో ఎక్కడా ఎటువంటి ఉద్యోగాల ఖాళీలు ఉండకూడదని, అన్ని పోస్టులను భర్తీ చేయాలని కేబినెట్ ఆదేశించింది. పండిన ధాన్యాన్ని పండినట్టే  ఫుడ్ ప్రాసెసింగ్ లో భాగంగా  మిల్లింగ్ చేసి ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడికి సరఫరా చేయాలని, ఈ దిశగా  అన్ని చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అవసరమైతే సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలని కేబినెట్ సూచించింది. నూతనంగా ముందుకు వచ్చే అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి మండలి అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో వ్యవసాయ సాగు విస్తీర్ణం పెరిగిందని, దీనికి అనుగుణంగా ధాన్యం నిలువ చేయడం, మార్కెటింగ్ చేయడం పై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుత వానాకాలం కోటి నలభై లక్షల ఎకరాల్లో వ్యవసాయ సాగు జరగనున్నదని, వరి పత్తి పంటలు రికార్డు స్థాయిలో పండనున్నాయని సిఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలన్నారు. నూతనంగా రైస్ మిల్లులు  పారబాయిల్డ్  మిల్లులను గణనీయంగా స్థాపించాలన్నారు. ఇందుకు సంబంధించి అత్యంత క్రియాశీలకంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను సిఎం ఆదేశించారు.