
- జెండర్ ఈక్వాలిటీపై ప్రచారం చేయాలి
- ‘స్త్రీ సమ్మిట్–2023’లో నటి ఫరియా అబ్దుల్లా
హైదరాబాద్, వెలుగు : సమాజంలో మహిళలకు మరింత గౌరవం దక్కాలని సినీ నటి ఫరియా అబ్దుల్లా తెలిపారు. జెండర్ ఈక్వాలిటీపై మరింత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.‘ స్త్రీలకు గౌరవం, సమానత్వం’ అంశంపై బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం ‘స్త్రీ సమ్మిట్–2023’ జరిగింది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో సీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన రెండు సెషన్లు నిర్వహించారు.ఈ సమ్మిట్‌కు హోంమంత్రి మహమూద్ అలీ, నటి ఫరియా అబ్దుల్లా చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ప్యానల్ డిస్కషన్‌లో వివిధ రంగాలకు చెందిన అజితా రెడ్డి, శిల్పా దాట్ల, కామిని సరాఫ్, చేతన జైన్ తమ సక్సెస్ వివరాలను వెల్లడించారు.
అనంతరం ఫరియా అబ్దుల్లా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ముంబయితో పోలిస్తే హైదరాబాద్‌లో మహిళలకు భద్రత ఎక్కువని.. ఆపదలో ఉన్న వారిని షీటీమ్స్, భరోసా సెంటర్లతో ఆదుకుంటున్నారని ఆమె తెలిపారు. రాష్ట్ర పోలీసులకు ఆమె సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు. సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వడంతో పాటు మనిషిని మనిషిగా చూడాలని ఫరియా అన్నారు. స్త్రీ సమ్మిట్ నిర్వహించడంపై హోంమంత్రి మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. విమెన్ సేఫ్టీకి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.