టాలీవుడ్‌‌కు ఇది శుభపరిణామం..సంక్రాంతికి రానున్న చిత్రాలపై క్లారిటీ

టాలీవుడ్‌‌కు ఇది శుభపరిణామం..సంక్రాంతికి రానున్న చిత్రాలపై క్లారిటీ

సంక్రాంతికి రానున్న చిత్రాలపై  కొన్ని రోజులుగా టాలీవుడ్‌‌లో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామిరంగ’, వెంకటేష్  ‘సైంధవ్’, రవితేజ  ‘ఈగల్’, తేజ సజ్జ  ‘హనుమాన్’  చిత్రాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. ఐదు చిత్రాలు ఒకేసారి రావడంతో థియేటర్స్‌‌ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు ఫిలిం చాంబర్, తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్‌‌ గురువారం సమావేశమై ఐదుగురు నిర్మాతలతో చర్చించారు. ఆ వివరాలను తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో దిల్ రాజు మాట్లాడుతూ

‘గతేడాది మూడు సినిమాలే విడుదలయ్యాయి. కానీ గట్టి పోటీ ఏర్పడింది. అలాంటిది ఈ ఏడాది ఐదు సినిమాలంటే సమస్యలు వస్తాయి. అందువల్ల పదిహేను రోజుల క్రితమే సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల నిర్మాతలు అందరినీ కలిసి చర్చించాం.  ఏమాత్రం అవకాశం ఉన్నా సంక్రాంతి సీజన్‌‌ నుంచి కొంత వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నించండి అని అందరినీ కోరాం. వెనక్కు వెళ్లడం అంటే తగ్గినట్టు కాదు. దానివల్ల మిగతా నాలుగు చిత్రాలకు థియేటర్స్‌‌ పెరిగి, తద్వారా రెవెన్యూ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీజీ విశ్వ ప్రసాద్‌‌ గారు తమ సినిమా

‘ఈగల్‌‌’ను వాయిదా వేసుకునేందుకు ముందుకొచ్చారు. ఇదొక మంచి పరిణామం. సహకరించిన హీరో రవితేజ గారు, నిర్మాతలు విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల గారికి థ్యాంక్స్. చాంబర్‌‌‌‌ ద్వారా ‘ఈగల్‌‌’ సినిమాకు సోలో డేట్‌‌ ఇవ్వాల్సి ఉంది.ఫిబ్రవరి 9న వచ్చేందుకు వాళ్లు సోలో డేట్ అడిగారు. ఇప్పటికే ఆ తేదీకి రెండు సినిమాలను ప్రకటించారు. ‘టిల్లు స్క్వేర్‌‌‌‌’ను వాయిదా వేసుకునేందుకు నాగవంశీ ఒప్పుకున్నారు.

అలాగే ‘యాత్ర’ ఉంది. ఆ నిర్మాతతోనూ చర్చించి డేట్ మార్చుకోమని కోరతాం’ అన్నారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్,  ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్,  నిర్మాతలు వెంకట్ బోయనపల్లి, శ్రీనివాస చిట్టూరి, కె.నిరంజన్ రెడ్డి, టీజీ విశ్వ ప్రసాద్ పాల్గొన్నారు.