
- టికెట్ ఆశించి భంగపడ్డ ప్రముఖులు
- బండ్ల గణేశ్‌కు దక్కని మల్కాజ్గిరి టికెట్
- చేవెళ్ల టికెట్ కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే
- అన్నకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న దిల్ రాజు
- అసెంబ్లీ టికెట్ల కోసం ట్రై చేసిన నితిన్, జీవిత, జయసుధ, రాహుల్ సిప్లిగంజ్
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికీ టికెట్ కేటాయించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనే టికెట్ల కోసం చాలా మంది సినీ ప్రముఖులు ట్రై చేశారు. అప్పుడు అవకాశం దక్కకపోవడంతో.. లోక్‌సభ ఎన్నికల్లో అయినా పోటీ చేద్దామనుకున్నారు. చివరికి ఇప్పుడు కూడా టికెట్లు ఇవ్వకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ 16, కాంగ్రెస్ 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ మొత్తం 17 మందిని అనౌన్స్ చేసింది. వీరిలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎవరూ లేరు. ఒకట్రెండు రోజుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
విజయశాంతికి దక్కని మల్కాజిగిరి సీటు
2009లో మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి.. తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. కాంగ్రెస్ మల్కాజిగిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆమెకు నిరాశ ఎదురైంది. కాగా, ఎమ్మెల్సీ లేదా మరో కీలక పదవి ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం.
నిర్మాత బండ్ల గణేశ్‌కు చుక్కెదురు
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కాంగ్రెస్ నుంచి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల టైమ్ నుంచి ఆయన కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించే ప్రెస్మీట్లకు అటెండ్ అవుతూ.. బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావుపై విమర్శలు చేస్తున్నారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్‌తో పాటు కీలక నేతలను కోరుతూ వచ్చారు. రేవంత్ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సునీతా మహేందర్ రెడ్డికి ఆ స్థానం కేటాయించడంతో బండ్ల గణేశ్‌కు నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆయన్ను బుజ్జగించినట్టు సమాచారం.
నిజామాబాద్ ఎంపీ సీటు కోసంకాంగ్రెస్లో పోటాపోటీ
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు (వెంకట్రామ్ రెడ్డి) పేరు 2014 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నుంచి వినిపిస్తున్నది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆయన ఏ స్థానం నుంచి కూడా పోటీ చేయలేదు. తాజాగా జహీరాబాద్ ఎంపీ టికెట్‌ను దిల్‌రాజుకు బీజేపీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌కు ఆ స్థానాన్ని కేటాయించింది. తన అన్న నర్సింహారెడ్డికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను దిల్ రాజు కోరుతున్నట్టు సమాచారం. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బాల్కొండ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది.
బీజేపీ నుంచి నితిన్‌కు నిరాశ
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ హీరో నితిన్ కూడా బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినట్టు సమాచారం. ఆ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సైతం హీరో నితిన్ తో భేటీ అయ్యారు. అయినా.. చివరికి నితిన్‌కు టికెట్ దక్కలేదు. ప్రముఖ సింగర్ రాహుల్ సింప్లిగంజ్ పేరు గోషామహల్ టికెట్ ఇచ్చేందుకు పరిశీలించింది. గాంధీ భవన్ కు ఆయన సన్నిహితులు వచ్చి అప్లై చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక బీజేపీ నుంచి సినీ నటి జీవిత, మాజీ ఎమ్మెల్సీ జయసుధ అసెంబ్లీ టికెట్లు ఆశించి నిరాశపడ్డారు. ఈ ఎన్నికలకు ముందు జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి టికెట్ దక్కలేదు.
పార్టీ మారినా.. టికెట్ దక్కలే..
చేవెళ్ల లేదా మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఆశించి కాంగ్రెస్‌లో చేరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి (హీరో అల్లు అర్జున్ మామ)కి నిరాశే మిగిలింది. 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నా.. అసెంబ్లీ టికెట్లు దక్కలేవు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ను కోరినా ఆయన పట్టించుకోలేదు. దీంతో చివరికి ఆయన బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్‌లో చేరారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనకే హైకమాండ్ సీటు కేటాయించింది. ఇక మల్కాజిగిరి నుంచి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఫైనల్ కావడంతో మళ్లీ చంద్రశేఖర్ రెడ్డికి నిరాశే ఎదురైంది.