పాలమూరు జిల్లాల్లో కలగానే ఫిల్టర్​ నీళ్లు..

పాలమూరు జిల్లాల్లో కలగానే  ఫిల్టర్​ నీళ్లు..
  • పంచాయతీ బోర్ల నీళ్లే తాగుతున్న ప్రజలు
  • మున్సిపాల్టీల్లోనూ రోజుల తరబడి సరఫరా బంద్​
  • అధికారుల నిర్లక్ష్యం, పెండింగ్​పనులతో తాగునీటి సమస్య

మహబూబ్​నగర్, వెలుగు : జిల్లాలో ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. మిషన్​భగీరథ పథకం ద్వారా రాష్ట్రమంతా  ఫిల్టర్​నీళ్లు సరఫరా చేస్తున్నామని పాలకులు చెప్తున్నా.. పాలమూరు ప్రజలకు అందడం లేదు. ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో ‘ భగీరథ’ పనులు ఇంకా పెండింగ్​లో ఉండడంతో నీటి సప్లై జరగడం లేదు. కొన్ని గ్రామాల్లో కనెక్షన్లు ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం వల్ల నీళ్లు రాక ప్రజలు గ్రామ పంచాయతీ బోర్ల నీళ్లనే తాగాల్సి వస్తోంది.

చాలా గ్రామాలకు బోరునీళ్లే దిక్కు..

మహబూబ్​నగర్​జిల్లా గండీడ్ మండలంలోని లింగాయపల్లి, గోవింద్​పల్లి, పీర్లబండతండా, బోడబండతండాలకు నాలుగేళ్లుగా ‘భగీరథ’ నీళ్లు వస్తలేవు. ఈ గ్రామాల్లో అన్ని ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చినా.. వాటర్ ట్యాంకులు ఎత్తు ప్రదేశంలో నిర్మించడంతో ఈ ట్యాంకుల్లోకి ‘భగీరథ’ నీళ్లు ఎక్కడం లేదు. దీంతో వాటర్ ట్యాంక్ దగ్గర సంపు నిర్మించి మరో బోరు మోటారు సాయంతో ట్యాంకులోకి నీటిని ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారే తప్ప, చర్యలు తీసుకోవడం లేదు. బాలానగర్​ గ్రామ పంచాయతీలో రెగ్యులర్​గా ‘భగీరథ’ వాటర్​సప్లై చేయడం లేదు. మూడు నాలుగు రోజులకోసారి  నీళ్లు సరఫరా అవుతుండడంతో మిగతా రోజుల్లో జీపీ బోర్ల ద్వారా ట్యాంకులను నింపి, నీటి సరఫరా చేస్తున్నారు. ఇదే మండలంలోని మోతిఘణపూర్​లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పెద్దరేవల్లిలో కూడా రోజుల తరబడి నీళ్లు రాకపోగా.. వచ్చినప్పుడైనా గ్రామానికి మొత్తం సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  దేవరకద్ర మండలంలోని నాలుగు గ్రామాల్లో  మాత్రమే నల్లాలు ఏర్పాటు చేశారు. మిగతా గ్రామాల్లో  నల్లాలు ఫిట్​ చేయకుండా పైపులైన్​వేసి వదిలేశారు. అడ్డాకుల మండలంలోని ముత్యాలంపల్లి గ్రామంలో కూడా రెగ్యులర్​గా భగీరథ నీళ్లు రాకపోవడంతో పంచాయతీ బోర్లు నుంచి నీటి సరఫరా చేస్తున్నారు.   నారాయణపేట జిల్లాలోని  మద్దూరు మండల కేంద్రంలో రెండు వార్డుల్లో, కోస్గి మండలం బోగారం, నర్వ మండలంలోని రెండు గ్రామాలు, దామరగిద్ద మండలంలోని మూడు గ్రామాలకు ఇప్పటికీ భగీరథ నీళ్లు వస్తలేవు. ఈ ఏరియాల్లో ఇంటర్నల్ పైపులైన్ పనులు పూర్తికాకపోవడంతో ఫిల్టర్​ వాటర్​ సఫ్లై చేయడం లేదు. వనపర్తి జిల్లాలోని బండరావిపాకుల, కానాయపల్లి ఆర్​అండ్​ఆర్​ సెంటర్లకు నీటి సరఫరా కావడం లేదు. 

మున్సిపాల్టీల్లోనూ అంతంతే..

మున్సిపాల్టీల్లో కూడా భగీరథ నీళ్లను రోజూ సప్లై చేయడం లేదు. మహబూబ్​నగర్​ మున్సిపాల్టీలో రెండు రోజులకోసారి నీటిని వదులుతున్నారు. దీనిపై లైన్​మెన్లను ప్రశ్నిస్తే పైనుంచే నీళ్లు వస్తలేవని చెప్తున్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాత లైన్లు ఉన్న వాటికే ‘భగీరథ’ నీటిని వదులుతున్నారు. కొత్తగా పైపులైన్లు వేసిన నాగర్​కర్నూల్​ రోడ్డు ఏరియా, పద్మావతికాలనీ, కేపీస్ర్టీట్​, నల్లకుంట, పాతబజార్​, సిగ్నల్​ గడ్డ ఏరియాల్లో నీళ్లు వస్తలేవు. కొత్త లైన్​ వేసినా, పాత లైన్లు తీసి కొత్త కనెక్షన్లకు లింక్​చేయాల్సి ఉంది. ఈ పనులు  కొంత కాలంగా పెండింగ్​లోనే ఉన్నాయి.

కంప్లైంట్లు చేసి విసిగిపోతున్న లీడర్లు

‘భగీరథ’ వాటర్​ సఫ్లై గురించి జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు ఆఫీసర్ల  దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. తాము పదే పదే కంప్లైంట్​చేసినా సమస్యలు పరిష్కరిస్తలేరని ఇటీవల జరిగిన జడ్పీ మీటింగ్​లో ఆర్​డబ్ల్యూఎస్​ ఆఫీసర్లపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల పనులు పెండింగ్​లో పెట్టారని, చెరువుల్లో గేట్​వాల్వ్​లు పెట్టడంతో వచ్చిన నీళ్లు కలుషితమవుతున్నాయని మండిపడ్డారు. జనాభాకు తగ్గట్లు నీటి సరఫరా జరగడం లేదని.. సభ దృష్టికి తీసుకెళ్లారు.  

 నల్లా తుప్పు పట్టింది..

‘భగీరథ’ కోసం మా ఇంటి ముందు నల్లా పెట్టిండ్రు. మొదట్లో కొద్ది రోజులు నీళ్లు వచ్చినయ్. మళ్లా ఏమైందో ఏమో రెండు నెలలుగా చుక్క నీరు కూడా వస్తలేదు. నీళ్లు రాక నల్లా కూడా తుప్పు పట్టింది. 

– రాణమ్మ, ముత్యాలంపల్లి 

ఫోన్లు కూడా ఎత్తరు

మా ఊరి ట్యాంక్ ఎత్తులో ఉంది. దీంతో భగీరథ నీళ్లు ఎక్కడం లేదని ఆఫీసర్లు చెప్పిండ్రు. ట్యాంక్​ వద్ద సంపు నిర్మించి వాటర్ ఎక్కించేందుకు చర్యలు తీసుకుంటమన్నరు.. మర్చిపోయిన్రు. సమస్య పరిష్కరించాలని ఎన్ని సార్లు ఫోన్లు చేసినా.. ఫోన్ ఎత్తరు.   

– వెంకటయ్య, సర్పంచ్, లింగయ్యపల్లి ​