ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి.. గ్రామాల వారీగా ఓటర్ల లిస్ట్ ఇదే..

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి.. గ్రామాల వారీగా ఓటర్ల లిస్ట్ ఇదే..
  • అన్ని జిల్లాల్లో పురుషుల కంటే మహిళలే అధికం
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం
  • 9 వరకు అభ్యంతరాలు.. 10న తుది జాబితా విడుదల
  • ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదుచూపులు

వెలుగు: ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేసింది. గ్రామ పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా జిల్లాలోని గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాను మంగళవారం పంచాయతీ అధికారులు రిలీజ్​ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,49,981 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. వీరిలో పురుషులు 2,19,652 ఓటర్లు, మహిళలు 2,30,313 మంది, ఇతరులు 16 మంది ఉన్నారు. 

నిర్మల్ జిల్లాలో 4,49,302 మంది ఓటర్లు ఉండగా పురుషులు 2,13,805, మహిళలు 2,35,485 మంది, ఇతరులు 12 మంది ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో 3,76,676 మంది ఓటర్లలో పురుషులు 1,85,646 మంది, మహిళలు 1,91,015 మంది, ఇతరులు 15 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం ఓటర్లు 3,53,895 మంది కాగా వీరిలో పురుషులు 1,76,606 మంది, మహిళలు 1,77,269 మంది, ఇతరులు 20 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ.

పరిషత్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం..

గ్రామ పంచాయతీ ఓటర్ల తుది జాబిత విడుదల చేసిన అధికారులు.. ఇక జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. ఈనెల 10న ఓటర్, పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 6న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. 6 నుంచి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, 8న జిల్లా స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి వారి సూచనలు తీసుకోనున్నారు.

 9న అభ్యంతరాలు, వినతులు తీసుకుంటామని, 10న తుది జాబితా ప్రకటిస్తామని జడ్పీ సీఈవో జితేందర్ రెడ్డి తెలిపారు. దీంతో పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల సంబంధించిన ప్రక్రియ పూర్తిచేసి సిద్ధంగా ఉంచాలని అధికారులు నిర్ణయించారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. 

రెండు విడతల్లో ఎన్నికలు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలో బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాలు ఉండగా.. ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గంలోని మండలాలకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అధికారులు సైతం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. జడ్పీటీసీకి పింక్ కలర్, ఎంపీటీసీలకు వైట్ కలర్ బ్యాలెట్ పత్రాలు ఇవ్వనున్నారు.

జిల్లా               ఓటర్లు    పురుషులు    మహిళలు    ఇతరులు

ఆదిలాబాద్     4,49,981    2,19,652    2,30,313    16
మంచిర్యాల     3,76,676    1,85,646    1,91,015     15
నిర్మల్            4,49,302    2,13,805    2,35,485    12
ఆసిఫాబాద్    3,53,895    1,76,606    1,77,269    20
మొత్తం        16,29,854    6,10,06    6,43,067    63