స్థానిక సమరానికి రెడీ.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

స్థానిక సమరానికి రెడీ.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం
  • ముగిసిన ఓటర్ల, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ 
  • ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశాల్లో చర్చ 
  • నేడు తుది ఓటర్ల జాబితా

ఆదిలాబాద్, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి సన్నద్ధత ఉండటంతో ఎన్నికల ప్రక్రియ జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే పీవో, ఎపీవో, రిటర్నింగ్ అధికారుల నియామకం పూర్తి చేసి శిక్షణ ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి పలు సూచనలు చేశారు.

 సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటు పాట్లు జరగకుండా రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్క్షప్తి చేశారు.  దీంతో ఇక ఎన్నికల కమిషన్ ఎప్పుడు షెడ్యుల్ విడుదల చేస్తుందనే ఉత్కంఠ నెలకొంది. 2024 ఫిబ్రవరి పంచాయతీ, జూన్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం కావడంతో హైకోర్టు ఆదేశాల మేరకు సమయానికి నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

సెప్టెంబర్ 2న తుది జాబితా..

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఓటర్లు, పోలింగ్ జాబితాలను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లో నోటీసు బోర్డులపై ప్రదర్శించారు. ఈ ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాల స్వీకరణ సైతం ముగిసింది. గురువారం ప్రదర్శించిన ఓటరు ముసాయిదా జాబితా ప్రకారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్లు 4,49,979, మంచిర్యాల జిల్లాలో 3,76,669 మంది, నిర్మల్ జిల్లాలో ఓటర్లు 4,49,302, ఆసిఫాబాద్ జిల్లాలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్లు తుది జాబితాను సెప్టెంబర్ 2న అధికారులు విడుదల చేయనున్నారు. 

పల్లెల్లో సందడి..

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పల్లెల్లో ఒక్కసారిగా ఎన్నికల సందడి నెలకొంది. ఆశవాహులు ఏడాది నుంచి ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండటంతో గ్రామాల అభివృద్ధికి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు  నెల రోజుల్లో పూర్తి చేయనుండటంతో పంచాయతీల్లో పాలన మెరుగుపడే అవకాశం ఉంది. అయితే ఈ సారి పంచాయతీ పోరు రసవత్తరంగా మారనుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి సారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పాగా వేసేందుకు సిద్ధమవుతోంది.

గ్రామాల్లో ఆశవాహులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం సైతం మాట ఇచ్చిన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధమవడంతో ఆసక్తి నెలకొంది. దీంతో గ్రామ పంచాయతీ చట్ట సవరణతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లలో మార్పు జరిగే అవకాశం ఉంది. అయితే రిజర్వేషన్ పై క్లారిటీ లేకపోయినప్పటికి ఆయా సామాజిక వర్గాల్లోనే ఆశవాహులు మాత్రం ప్రజల్లో తాము పోటీలో ఉంటున్నామనే సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యువతను ఆకట్టుకునేందుకు గణేశ్ మండపాలకు పెద్ద ఎత్తున చందాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

జిల్లా                గ్రామపంచాయతీ    జడ్పీటీసీ    ఎంపీటీసీ 
ఆదిలాబాద్                473                    20                166
మంచిర్యాల               305                    16                129
నిర్మల్                        400                    18                157
ఆసిఫాబాద్                335                    15                127