మా పాలసీలతోనే తయారీ రంగం పరుగులు : నిర్మలా సీతారామన్‌‌

మా పాలసీలతోనే తయారీ రంగం పరుగులు : నిర్మలా సీతారామన్‌‌

న్యూఢిల్లీ: ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వలనే  తయారీ, సర్వీసెస్ కంపెనీలకు ఇండియా గమ్యస్థానంగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పేర్కొన్నారు. కేవలం డొమెస్టిక్ మార్కెట్‌‌ కోసమే కాకుండా, విదేశాలకు ఎగుమతి చేయడానికి  ఇండియాలో ప్రొడక్ట్‌‌లు తయారు కావాలన్నారు. ‘పెట్టుబడులను ఆకర్షించడానికే పాలసీలు తీసుకొచ్చాం.

ఎగుమతులు కూడా జరిపేందుకు తయారీ కంపెనీలు  ఇండియాలో ప్రొడక్షన్ చేపట్టాలని కోరుకుంటున్నాం. తయారీ కంపెనీలను, ఇన్వెస్టర్లను పాలసీల ద్వారా ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని నిర్మలా సీతారామన్ వివరించారు.  పెద్ద కంపెనీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాటిని ఆకర్షించడానికి అన్ని చేస్తామని, ఈ ప్రాసెస్‌‌లో ఏమైనా చర్చించడానికి ఉంటే చర్చిస్తామని అన్నారు. కానీ, ఏం చేసినా అవన్నీ పాలసీల ద్వారానే చేస్తామని వివరించారు. మోదీ ప్రభుత్వంలో ఒక్క నెల మినహా  ఇన్‌‌ఫ్లేషన్ ఎప్పుడూ లిమిట్‌‌ దాటలేదని, కానీ 2014 ముందు ఎకానమీ అధ్వాన్నంగా ఉండేదని, ఇన్‌‌ఫ్లేషన్ డబుల్ డిజిట్‌‌లో నమోదయ్యేదని నిర్మల  అన్నారు.

2014 ముందు ఇండియాపై పెద్దగా అంచనాలు లేవని, తామొచ్చాక  ఐదో అతిపెద్ద ఎకానమీగా ఎదిగామని, ఇంకో రెండున్నరేళ్లలో మూడో అతిపెద్ద ఎకానమీగా మారుతామని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్‌‌, అనార్గనైజ్డ్ సెక్టార్లలో జాబ్స్‌‌ డేటా సరిగ్గా లేదని, కానీ లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని పేర్కొన్నారు. గ్లోబల్‌‌ సమస్యల కారణంగా డాలర్ మారకంలో రూపాయి బలహీనంగా ఉందన్నారు. ఐఎఫ్‌‌ఎస్‌‌సీ గిఫ్ట్ సిటీతో గుజరాత్‌‌లో సర్వీసెస్ సెక్టార్ మరింతగా విస్తరిస్తుందని నిర్మలా సీతారామన్​ అన్నారు.