
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మల గురువారం ఇంటెరిమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత పదేళ్లు గమనిస్తే బడ్జెట్ రోజు మార్కెట్ తీవ్రంగా కదులుతోంది. నిఫ్టీ గతంలో బడ్జెట్ రోజు, ఆ తర్వాత రోజు ఎలా స్పందించిందో చూద్దాం.
1. కిందటేడాది ఫిబ్రవరి ఒకటిన నిఫ్టీ పెద్దగా స్పందించలేదు. కేవలం 0.26 శాతం మాత్రమే పడింది. ఆ తర్వాత రోజు ఫ్లాట్‌గా క్లోజయ్యింది.
2. నిఫ్టీ ఎక్కువగా 2021 బడ్జెట్ రోజు స్పందించింది. ఈ రోజు ఏకంగా 4.74 శాతం ర్యాలీ చేసింది. ఆ తర్వాత రోజు కూడా 2.57 శాతం ఎగసింది.
3. గత పదేళ్లు చూస్తే, నిఫ్టీ 2020 ఫిబ్రవరి 1 న ఎక్కువగా క్రాష్ అయ్యింది. ఈ రోజు 2.51 శాతం పడింది. ఆ తర్వాత రోజు 0.39 శాతం పెరిగింది.
4. మిగిలిన బడ్జెట్ రోజుల్లో పెద్దగా కదలలేదు. సుమారు ఒక శాతం లోపు పెరగడం లేదా పడడం జరిగింది. కానీ, ఆ తర్వాత రోజుల్లో మాత్రం తీవ్ర వోలటాలిటీ కనిపించింది.
వారం ముందు .. వారం తర్వాత ఇలా
బడ్జెట్‌కు నెల రోజుల ముందు నుంచే మార్కెట్‌లో వోలటాలిటీ కనిపిస్తుంది. క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ టార్గెట్స్, డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్, ఫిస్కల్ డెఫిసిట్ నెంబర్లు, బడ్జెట్ కేటాయింపులు వంటివి మార్కెట్ మూడ్‌ను మారుస్తున్నాయి. 2020, 2016, 2014 లోని బడ్జెట్ టైమ్‌లో మార్కెట్‌లో తీవ్ర వోలటాలిటీ కనిపించింది. కిందటేడాది బడ్జెట్‌కు వారం రోజుల ముందు నిఫ్టీ 2.77 శాతం క్రాష్ అయ్యింది. బడ్జెట్ తర్వాతి వారం రోజుల్లో 0.6 శాతం పెరిగింది.