వీడనున్న ‘బిగ్ బ్యాంగ్’ గుట్టు !

వీడనున్న ‘బిగ్ బ్యాంగ్’  గుట్టు !
  •  లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ ప్రయోగంలో మరో ముందడుగు 
  • ‘ఎక్స్’ పార్టికల్స్​ మూలాలను గుర్తించిన ఎంఐటీ సైంటిస్టులు 

న్యూయార్క్: బిగ్​బ్యాంగ్.. సుమారు 1350 కోట్ల ఏండ్ల కిందట జరిగిన ఈ మహా పేలుడు వల్లే మన భూమితో సహా ఈ సువిశాల విశ్వం ఏర్పడిందని సైంటిస్టులు ఎప్పట్నుంచో చెప్తున్న మాట. కొన్ని లక్షల కోట్ల డిగ్రీల వేడి ఉన్న చిన్న చిన్న ఆటమ్స్ (క్వార్క్ లు, గ్లువాన్ లు) ఢీకొట్టుకోవడం వల్ల పదార్థం ఏర్పడిందని, మన భూమి ఆవిర్భావానికీ ఇవే కారణమని చెప్తారు. అలాగే బిగ్ బ్యాంగ్ తర్వాత ఆటమ్స్ చల్లబడే క్రమంలో.. ఇప్పటికీ అంతుచిక్కని ‘ఎక్స్’ పార్టికల్స్ ఏర్పడి క్షణాల్లోనే అంతమైపోయాయని అంటూ ఉంటారు. వాటి రూపం ఏంటి? ఎలా ఉంటాయన్నది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. తాజాగా అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) సైంటిస్టులు ఆ క్రమంలో ఒక ముందడుగు వేశారు. జెనీవాలోని సెర్న్ (యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్)లోని లార్జ్ హ్యాడ్రన్​ పార్టికల్ కొలైడర్​(ఎల్ హెచ్ సీ)లో ఆ ఎక్స్ పార్టికల్ మూలాలను గుర్తించారు. 1,300 కోట్ల అయాన్లు ఢీకొట్టుకోవడం వల్ల ఇవి ఏర్పడ్డాయని మెషీన్ లెర్నింగ్ టెక్నిక్స్ ద్వారా తెలుసుకోగలిగారు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమేనని, భవిష్యత్​లో క్వార్క్–గ్లువాన్​లను వాడుకుని ‘ఎక్స్’ పార్టికల్స్​ లోపలి నిర్మాణాన్ని స్టడీ చేస్తామని ఎంఐటీ ఫిజిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్ యెన్జీ లీ చెప్పారు. కాగా, పదార్థం (మ్యాటర్​) ఏర్పడడానికి న్యూట్రాన్లు, ప్రోటాన్లే ప్రధాన కారణం అని సైంటిస్టులు చెప్తుంటారు. అయితే, ఈమధ్యే నాలుగు ఆటమ్స్ కలవడం వల్ల ఏర్పడిన ‘టెట్రాక్వార్క్’లను కూడా సైంటిస్టులు గుర్తించారు. ఆ టెట్రాక్వార్కులే ఎక్స్​పార్టికల్స్ అని అనుమానిస్తున్నారు. వీటిపై స్టడీతో విశ్వంలో పదార్థం పుట్టుకకు సంబంధించి మరింత లోతుగా తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.