కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లాలో వరుసగా అగ్నిప్రమాదాలు

కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లాలో వరుసగా అగ్నిప్రమాదాలు
  • ఫైరింజిన్​వచ్చేలోపు బూడిదే
  • 15 మండలాల్లో రెండే ఫైర్​ ఇంజిన్లు
  •  మూడు రోజుల్లో రెండు అగ్నిప్రమాదాలు 


ఆసిఫాబాద్,వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ ​జిల్లాలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు రోజుల్లో జరిగిన రెండు ప్రమాదాలతో బాధితులకు నిలువ నీడలేకుండా పోయింది. జిల్లాలో  రెండే అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఫైరింజిన్​ వచ్చేలోపే ఆస్తి అంతా కాలిబూడిదవుతోంది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగినప్పుడల్లా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 15 మండలాలు ఉండగా, ఆసిఫాబాద్,కాగజ్ నగర్ పట్టణాల్లోనే అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ఆసిఫాబాద్​లోని ఓ ఫైర్​ఇంజిన్​పనిచేయడంలేదు. నియెజక వర్గంలో ఆసిఫాబాద్, కెరమెరి , జైనూర్, వాంకిడి, రెబ్బెన, తిర్యాణి, లింగాపూర్, సిర్పూర్ (యు) మండలాల్లోని పలు గ్రామాలు జిల్లా కేంద్రానికి సుమారు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి.  కాగజ్ నగర్ లో ఉన్న మరో అగ్నిమాపక కేంద్రం పరిధిలో సిర్పూర్​నియోజకవర్గంలోని కాగజ్​నగర్, దహెగాం, పెంచికల్ పేట, కౌటాల, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్ (టి) మండలాలు ఉన్నాయి. అయితే ఫైర్​ఇంజిన్​కాగజ్​నగర్​నుంచి ఏ మండలానికి వెళ్లాలన్నా... కనీసం 70 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఫలితంగా అగ్నిప్రమాదాలు జరిగినప్పుడల్లా ఫైరింజిన్​వచ్చే లోపే ఆస్తి అంతా కాలిబూడిదవుతోంది. 

దూరభారం.. ఆస్తి నష్టం

ఆసిఫాబాద్, కాగజ్ నగర్​లో ఉన్న ఫైరింజిన్లతో స్థానికంగా జరిగే అగ్నిప్రమాదాలు నివారించే అవకాశం ఉంది.  కానీ.. దూర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే మాత్రం ఫైర్​ఇంజిన్​వెళ్లేలోపే జరగాల్సిన నష్టం జరుగుతోంది. ఆసిఫాబాద్​ రూరల్, కాగజ్​నగర్​ రూరల్​ ఏరియాల్లో మరో రెండు అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరిగినప్పుడు నష్టం జరగకుండా అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. పత్తి, ధాన్యం ఇండ్లలో నిల్వలేకుండా చూసుకోవాలి. రాత్రిపూట గ్యాస్  సిలిండర్ వాల్వ్​క్లోజ్​చేసి ఉంచాలి. ఇండ్లలో కరెంట్​వైర్లు సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి.  ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వాలి.
- అజయ్ కుమార్, డివిజన్ ఫైర్ ఆఫీసర్​


80 క్వింటాళ్ల పత్తి దగ్ధం

కాగజ్ నగర్ మండలం రాస్పల్లిలో గత శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన రైతు పెర్క సంతోష్​ ఇంటికి నిప్పంటుకుంది. రైతులు, చుట్టుపక్కలవారు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. ఫైరింజిన్​కు సమాచారం ఇచ్చారు. కానీ లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగింది. ఫైరింజిన్ వచ్చేలోపే రైతు ఇంట్లో నిల్వచేసిన సుమారు 80 క్వింటాళ్ల పత్తి, 20 క్వింటాళ్ల ధాన్యం కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 6.5 లక్షల నష్టం జరిగింది.

ఆరు ఇండ్లు దగ్ధం

తిర్యాణి మండలం పంగిడి మాదర పంచాయతీ పరిధిలోని సల్పలగూడలో ఈనెల 6న అగ్నిప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన ఆత్రం ప్రభు, ఆత్రం బల్లార్షా, పంద్రం జయవంత్ రావు, పంద్రం లక్ష్మణ్​కు చెందిన ఆరు ఇండ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇంట్లో నిల్వచేసిన కందులు, పత్తి, బియ్యం, బంగారం, వెండి ఇతర సామగ్రి బుగ్గిపాలయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగింది.