మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిప్రమాదం..సెక్యూరిటీ స్కానర్‌లో మంటలు

మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిప్రమాదం..సెక్యూరిటీ స్కానర్‌లో మంటలు

మహారాష్ట్ర అసెంబ్లీలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం (మే19) మధ్యాహ్నం ముంబైలోని మహారాష్ట్ర అసెంబ్లీ( విధాన భవన్ ) సెక్యూరిటీ స్కానర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బంది పరుగులు పెట్టారు. ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి  మంటలను ఆర్పివేసింది. భద్రతా స్కానింగ్ యంత్రం నుంచి  వచ్చిన మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 

ముంబై ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. విధాన్ భవన్ కాంప్లెక్స్ గ్రౌండ్-ఫ్లోర్ ఎంట్రీ చెకింగ్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. మంటల్లో విద్యుత్ వైరింగ్, ఇన్‌స్టాలేషన్లు, స్విచ్‌బోర్డ్ కాలిపోయాయి. అదృష్టవశాత్తూ మంటలు ఈ ప్రాంతానికే పరిమితం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు సెక్యూరిటీ మిషన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనం నుండి పొగ వెలువడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో త్వరగా వ్యాపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే అగ్ని ప్రమాదం చిన్నదేనని ,అసెంబ్లీలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించలేదని అధికారులు ప్రజలకు తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. 

ALSO READ | గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా మిసైల్, డ్రోన్ల దాడికి పాక్ ప్లాన్.. కీలక విషయం బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ

ఈ సంఘటన తర్వాత షార్ట్ సర్క్యూట్ కు ఖచ్చితమైన కారణం తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అదనపు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఫైర్ యాక్సిడెంట్ తో అసెంబ్లీ కార్యక్రమాలకు కొంత అంతరాయం ఏర్పడింది. అయితే వెంటనే తిరిగి షెడ్యూల్ ప్రకారం కొనసాగాయి. అగ్నిమాపక శాఖ వెంటనే స్పందించడం, మంటలను అదుపు చేయడంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఆలస్యం లేకుండా సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.