గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా మిసైల్, డ్రోన్ల దాడికి పాక్ ప్లాన్.. కీలక విషయం బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ

గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా మిసైల్, డ్రోన్ల దాడికి పాక్ ప్లాన్.. కీలక విషయం బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‎కు ప్రతీకారంగా అమృత్‎సర్‎లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులతో దాడులకు ప్రయత్నించిందని.. దాయాది దేశ దాడులను ఎక్కడికక్కడ తిప్పి కొట్టి స్వర్ణ దేవాలయాన్ని కాపాడామని ఇండియన్ ఆర్మీ వెల్లడిచింది. 15వ పదాతిదళ విభాగం జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (GOC) మేజర్ జనరల్ కార్తీక్ సి శేషాద్రి సోమవారం (మే 19) మీడియాతో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. 

వెంటనే అప్రమత్తమైన భారత్ ఎయిర్ డిఫెన్స్ పాక్ డ్రోన్లు, క్షిపణులను ఎక్కడికక్కడ కూల్చివేసింది. స్వర్ణ దేవాలయం వంటి మతపరమైన ప్రదేశాలు, పౌర స్థావరాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్  దాడులు చేస్తుందని ముందే ఊహించాం. ముఖ్యంగా గోల్డెన్ టెంపుల్‎పై దాడి చేయడం వాళ్ల లక్ష్యం. పాక్ కుట్రలను ముందే పసిగట్టి గోల్డెన్ టెంపుల్ వద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‎ను మోహరించి.. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిస్సైళ్లను నేలమట్టం చేసి గోల్డెన్ టెంపుల్‎పై చిన్న గీత కూడా పడకుండా రక్షించామని తెలిపారు.

Also Read : యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరెస్ట్

 మే 8న పాకిస్తాన్ మానవరహిత డ్రోన్లు, దీర్ఘశ్రేణి క్షిపణులతో భారీ వైమానిక దాడి చేసిందని.. మేం ముందుగానే సిద్ధంగా ఉండి పాక్ దాడులను తిప్పికొట్టామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‎లో భాగంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని అనేక ప్రదేశాలను అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేశాయని, ఉగ్రవాద సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్న మురిద్కే, బహవల్‌పూర్ వంటి ప్రాంతాలపై దాడి చేశామని పేర్కొన్నారు. భారత్ ఉద్దేశపూర్వకంగా ఏ పాకిస్తాన్ సైనిక లేదా పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయలేదని.. కేవలం ఉగ్రవాదులు, వారి స్థావరాలే టార్గెట్ గా ఎటాక్స్ చేశామని వివరణ ఇచ్చారు.