
- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి
- ఇక ఫైర్ సేఫ్టీ విషయంలో పకడ్బందీ చర్యలు
- బల్దియా కమిషనర్ కర్ణన్
- స్మోక్ డిటెక్టర్, అలారం తప్పనిసరి : కలెక్టర్ అనుదీప్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫైర్ యాక్సిడెంట్ల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీ నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో అగ్ని ప్రమాదాల నివారణకు బల్దియా కమిషనర్ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, విద్యుత్, టౌన్ ప్లానింగ్, హైడ్రా, ఫైర్ సేఫ్టీ అధికారులతో సమావేశం నిర్వహించారు. పురాతన భవనాల్లో అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు, గుల్జార్ హౌస్ వద్ద జరిగిన ప్రమాదం మరోసారి రిపీట్కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా శాఖలు సూచనలు ఇవ్వాలని కోరారు.
హెరిటేజ్ బిల్డింగుల్లో గానీ, ఇతర బిల్డింగుల్లో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి పరికరాలు వినియోగించాలో చెప్పాలని ఎలక్ట్రికల్అధికారులను కోరారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు సేఫ్టీ మెజర్స్ ఉంటేనే ట్రేడ్ లైసెన్స్, ఎన్ఓసీ ఇవ్వాలన్నారు.
శిథిలావస్థ బిల్డింగులను సర్వే చేస్తున్నం
జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్మాట్లాడుతూ నగరంలో శిథిలావస్థలో ఉన్న బిల్డింగులను సర్వే చేయనున్నట్లు తెలిపారు. డీజీ సూచన మేరకు వ్యాపార సముదాయాలు, వ్యాపార భవనాల్లో ఫైర్ సేఫ్టీ విషయంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు కొత్త భవన నిర్మాణాల అనుమతి విషయంలో ఫైర్ సేఫ్టీకి ప్రాధాన్యత నివ్వాలని కోరారు. కమర్షియల్కాంప్లెక్స్లు, కమర్షియల్బిల్డంగుల్లో ఫైర్ సేఫ్టీపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఫైర్ సమాచారం మాకూ ఇవ్వాలి
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో ఫైర్, పోలీస్ శాఖలకు మాత్రమే సమాచారం ఇస్తున్నారని, రెవెన్యూ శాఖకు కూడా ఇన్ఫర్మేషన్ఇస్తే జిల్లా యంత్రాంగం తరపున అంబులెన్సులు సిద్ధం చేయడం, దవాఖానల్లో చికిత్స, డాక్టర్లను సిద్ధం చేయడం లాంటి చర్యలు సకాలంలో తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
15 మీటర్ల లోపు ఉన్న బిల్డింగులు, హాస్పిటల్, షాపింగ్ మాల్స్, ఆఫీస్ బిల్డింగ్, లాడ్జింగ్, హోటల్, బిజినెస్ మాల్స్, స్టోరేజీ బిల్డింగులు ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలన్నారు. స్మోక్ డిటెక్టర్ తో పాటు అలారం కూడా ఉండాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెంకన్న, ప్రదీప్, డిస్కమ్ సీఈ, హైడ్రా, ఫైర్, ఎలక్ట్రిసిటీ అధికారులు పాల్గొన్నారు.