కోర్టులో లాయర్ కాల్పులు.. నిందితుడి మృతి

కోర్టులో లాయర్ కాల్పులు.. నిందితుడి మృతి

న్యూఢిల్లీ: కేసు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన నిందితుడిని కోర్టు బిల్డింగ్‌లోనే ఓ లాయర్ తుపాకీతో కాల్చి చంపాడు. ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఈ ఘటన జరిగింది. ఒక కేసులో నిందితుడిగా ఉన్న ఉపకార్‌‌ అనే వ్యక్తి సోమవారం ద్వారకా కోర్టుకు వెళ్లాడు. కోర్టు బిల్డింగ్‌లోని చాంబర్ నంబర్ 444లో అరుణ్ శర్మ అనే లాయర్‌‌తో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడ లాయర్లు, పోలీసులతో పాటు మరికొందరు పిటిషనర్లు ఉన్నారు. అయితే తుపాకీతో కాల్చిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతడు చిక్కకుండా పారిపోయాడు. బుల్లెట్‌ గాయాలైన ఉపకార్‌‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు మరణించాడు. అయితే ఈ ఘటన సోమవారం రాత్రి 9 గంటల టైమ్‌లో జరిగిందని, కాల్పులు జరిపిన వ్యక్తిని ఒక లాయర్‌‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ లాయర్‌‌ను పట్టుకునేందుకు వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడి సెర్చ్ చేస్తున్నట్లు చెప్పారు.