కరోనాతో వ్యక్తి మృతి.. ఆరుగురు కుటుంబసభ్యులకు పాజిటివ్‌

కరోనాతో వ్యక్తి మృతి.. ఆరుగురు కుటుంబసభ్యులకు పాజిటివ్‌
  • మేఘాలయలో మొదటి కరోనా మరణం

షిల్లాంగ్‌: మేఘాలయలో మొదటి కరోనా మరణం సంభవించింది. రాష్ట్రంలో మొదట కరోనా పాజిటివ్‌ వచ్చిన బెత్‌హనీ హాస్పిటల్స్‌ ఫౌండర్‌‌ డాక్టర్‌‌ జాన్‌ (65) బుధవారం తెల్లవారుజామున చనిపోయారు. కాగా.. ఆయన సహాయకులు, ఫ్యామిలీ మెంబర్స్‌లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర సీఎం సంగ్మా చెప్పారు. దీంతో మేఘాలయాలో కేసుల సంఖ్య ఆరుకి చేరింది. “ రాష్ట్రంలోని మొదటి కరోనా పేషంట్‌ చనిపోయాడన్న విషయాన్ని చెప్పేందుకు చాలా బాధపడుతున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు 68 మందిని టెస్ట్‌ చేయగా.. వారిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. వాళ్లంతా చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు, హెల్పర్స్‌” అని సంగ్మా చెప్పారు. షిల్లాంగ్‌లోని డాక్టర్‌‌ జాన్‌కు సోమవారం కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన హాస్పిటల్‌ను మూసేసిన అధికారులు మార్చి 22 తర్వాత ఆయన దగ్గర ట్రీట్‌మెంట్‌కు వచ్చిన 2వేల మందిని పరీక్షించారు. వారిలో లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించారు.