ఆంధ్రప్రదేశ్ లో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో మొదటి డెల్టా ప్లస్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి డెల్టా ప్లస్‌ కేసు నమోదైంది. ఇటీవల తిరుపతిలో ఓ వ్యక్తికి కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ సోకినట్టు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఇవాళ(శుక్రవారం) సీఎం జగన్‌ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని ఈ విషయాన్ని తెలిపారు.

డెల్టా ప్లస్ వేరియంట్ కేసు ఏపీలో ఇదే మొదటిదన్నారు ఆళ్ల నాని. అయితే.. ఆ వ్యక్తి నుంచి ఇతరులు ఎవరికీ కరోనా వేరియంట్ సోకలేదని తెలిపారు. ఇప్పుడా వ్యక్తికి చికిత్స కూడా పూర్తయి..కోలుకోవడం కూడా జరిగిందని అన్నారు. తిరుపతి కేసు మినహా ఏపీలో మరెక్కడా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు లేవని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. 

బ్లాక్‌ ఫంగస్‌, డెల్టా ప్లస్‌ కేసుల పట్ల అలర్ట్ గా ఉండాలని.. అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. మూడో వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారన్నారు.