- ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
- ఒంటిగంట వరకు ఓటింగ్.. 2 గంటల నుంచి కౌంటింగ్
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్, సీసీ కెమెరాలు
- అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు
మంచిర్యాల, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్లకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11న జరిగే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఆ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లితో పాటు ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని జన్నారం మండలంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
నిర్మల్‌జిల్లాలోని ఆరు మండలాలు ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్, మామడ, లక్ష్మణచాందలో ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు మండలాలు ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్, గాదిగూడ, సిరికొండ, ఇచ్చోడలో గురువారం ఎలక్షన్లు జరగనున్నాయి. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్, కెరిమెరి, లింగాపూర్, సిర్పూర్(యు), వాంకిడి మండలాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.
మంచిర్యాల జిల్లాలో 748 పోలింగ్ స్టేషన్లు
మంచిర్యాల జిల్లాలో మొత్తం 90 సర్పంచ్ స్థానాలకు గాను ఎస్టీలకు కేటాయించిన దండేపల్లి మండలం గూడెం, నెల్కి వెంకటాపూర్లో అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు రాలేదు. ఇక వందూర్ గూడను నెల్కివెంకటాపూర్ జీపీలోనే కొనసాగించాలంటూ ఎన్నికలు బహిష్కరించారు. దండేపల్లి మండలంలో నాలుగు, జన్నారం మండలంలో రెండు జీపీలో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఈ తొమ్మిది జీపీలు మినహా మిగిలిన 81 సర్పంచ్ స్థానాలకు 252 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 816 వార్డులకు గాను 268 వార్డులు ఏకగ్రీవం కాగా, 34 వార్డులకు నామినేషన్లు రాలేదు. మిగిలిన 514 వార్డులకు 1208 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 748 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లా ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు అన్ని చోట్లా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల జిల్లాలో 2,144 సిబ్బంది, 90 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. 748 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. 24 లొకేషన్లలోని 156 సమస్యాత్మాక పోలింగ్ సెంటర్లలో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలతో పోలింగ్ తీరును పర్యవేక్షించనున్నారు. 20 లొకేషన్లలో 136 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సామగ్రితో బుధవారం సాయంత్రం పోలింగ్ సిబ్బంది గ్రామాలకు బయల్దేతారు.
ఒంటి గంట వరకే పోలింగ్
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ జరుగుతుంది. అప్పటివరకు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ఎన్నికైన వార్డు సభ్యులు ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
పంపకాల్లో అభ్యర్థులు
పార్టీ గుర్తులకు అతీతంగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగారు. మరోవైపు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.2వేల వరకు పంచుతున్నట్టు తెలుస్తోంది. మద్యం ఏరులై పారుతోంది. పలు గ్రామాల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు చీరలు పంచుతున్నారు. మంగళవారం రాత్రి హాజీపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, పోలీసులు 297 చీరలను పట్టుకున్నారు.
