David Warner: ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్, సిడ్నీ థండర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) మళ్లీ చిక్కుల్లో పడ్డారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో (Drink-Driving Offence) ఆయన కోర్టులో తన నేరాన్ని అంగీకరించారు. సిడ్నీలోని వేవర్లీ లోకల్ కోర్టులో జరిగిన విచారణలో వార్నర్ తరఫు న్యాయవాది బాబీ హిల్ ఈ నేరాన్ని అంగీకరించారు. ఆయనకి సుమారు 9 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈక్రమంలో బిగ్ బాష్ లీగ్ (BBL) లో సిడ్నీ థండర్స్ సారథిగా వార్నర్ పీఠం ఊడే అవకాశం ఉందనే చర్చ క్రీడా వర్గాల్లో మొదలైంది.
ఫ్రెండ్ ఇంట్లో పార్టీ.. వార్నర్ తెలివితక్కువ పని:
ఈస్టర్ సండే రోజున జరిగిన ఈ ఘటనపై డేవిడ్ వార్నర్ లాయర్ కోర్టులో స్పందిస్తూ పలు వివరాలను వెల్లడించారు. ఆ రోజు స్నేహితుడి నివాసంలో వార్నర్ మూడు గ్లాసుల వైన్ తాగాడని చెప్పారు. తాను చేసిన తప్పు తీవ్రమైనదని ఆయనకి తెలుసు.. ఆ సమయంలో కారు నడపడానికి బదులు ఉబర్ (Uber) క్యాబ్ బుక్ చేసుకోకపోవడం వార్నర్ చేసిన తెలివితక్కువ నిర్ణయమని ఒప్పుకున్నాడు. ప్లాన్-B (క్యాబ్) ఎంచుకోకుండా ప్లాన్-A (డ్రైవింగ్) ఎంచుకోవడమే ఇక్కడ ఆయన చేసిన అసలైన నేరం అని బాబీ హిల్ (డేవిడ్ వార్నర్ లాయర్) వెల్లడించాడు.
ఆల్కహాల్ శాతం 0.104 నమోదు:
ఏప్రిల్ 5న సిడ్నీ తూర్పు ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న డేవిడ్ వార్నర్‌ను పోలీసులు ఆపి బ్రీత్ టెస్ట్ నిర్వహించగా ఆల్కహాల్ పాజిటివ్‌గా తేలింది. దీంతో తదుపరి పరీక్షల కోసం ఆయనను మరోబ్రా (Maroubra) పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ఆయన రక్తంలో ఆల్కహాల్ శాతం 0.104 గా నమోదైంది. ఇది ఆస్ట్రేలియా చట్టాల ప్రకారం అనుమతించబడిన పరిమితి కంటే రెండు రెట్లకు పైగా ఎక్కువగా ఉండటం గమనార్హం. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో కరాచీ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి, ఈస్టర్ సెలవుల కోసం సిడ్నీకి తిరిగొచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వార్నర్ పై తీవ్ర విమర్శలు:
ఈ పరిణామం సిడ్నీ థండర్స్ యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యూ సౌత్ వేల్స్ (NSW) ప్రభుత్వం మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఒక ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రచారంలో సిడ్నీ థండర్స్, సిడ్నీ సిక్సర్స్, న్యూ సౌత్ వేల్స్ బ్లూస్ జట్లు ప్రధాన భాగస్వాములుగా ఉన్నాయి. ప్రజలకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని సందేశం ఇచ్చే జట్టుకే కెప్టెన్‌గా ఉన్న వార్నర్ స్వయంగా ఇదే కేసులో దొరికిపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ALSO READ : స్పెయిన్ ప్లేయర్లతో ఘర్షణ.. అర్జెంటీనా ప్లేయర్లపై ఫిఫా విచారణ
2018 నుంచి వివాదాల్లో వార్నర్:
దక్షిణాఫ్రికాతో జరిగిన 2018 టెస్ట్ మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్ వివాదం తర్వాత వార్నర్‌పై నాయకత్వ బాధ్యతలకు సంబంధించి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇక 2024లో ఆ నిషేధాన్ని అధికారికంగా ఎత్తివేడంతో సిడ్నీ థండర్స్ యాజమాన్యం ఆయనని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఇప్పుడు మళ్లీ లీగల్ చిక్కుల్లో పడటంతో, థండర్స్ యాజమాన్యం ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
