దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి హీరోయిన్. శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి తొలిపాటను విడుదల చేశారు. ‘రాధే రాధే’ అంటూ సాగే ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ కంపోజ్ చేయడంతో పాటు లిప్సిక భాష్యంతో కలిసి పాడారు.
‘‘రాధే రాధే నీ బృందావనమే ఇది కాదే.. రాదే సరిరాదే.. ఏ ప్రేమ నీతో సరిరాదే, ఏ కలలకు వారధివో.. ఏ గెలుపుకు సారధివో ఏమో, నీ కథ నీదే... నీదంటూ ఓ లోకం, క్షణమాగదు నీ పయణం, అలుపే నీదరి రాదే..” అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
ఈ పాట హీరో అంతరంగాన్ని పరిచయం చేస్తూనే, అతని జీవితంలో ముందుకు సాగబోయే ప్రయాణం ఎలా ఉండబోతోందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 20న పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
