IND vs ENG 4th Test: ఇంగ్లాండ్ బజ్ బాల్‌కు భారత్ పంచ్..కెప్టెన్‌గా స్టోక్స్‌కు తొలి టెస్ట్ సిరీస్ ఓటమి

IND vs ENG 4th Test: ఇంగ్లాండ్ బజ్ బాల్‌కు భారత్ పంచ్..కెప్టెన్‌గా స్టోక్స్‌కు తొలి టెస్ట్ సిరీస్ ఓటమి

బజ్ బాల్ అంటూ ఇంగ్లాండ్ ప్రపంచ క్రికెట్ పై ఆధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు బజ్ బాల్ క్రికెట్ ఆడుతూ  ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. సొంతగడ్డపై మాత్రమే కాదు.. ఉపఖండపు పిచ్ లపై చెలరేగి ఆడారు. ఈ క్రమంలో పాకిస్థాన్ పై 2022లో 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసి పెద్ద షాక్ ఇచ్చారు. అయితే భారత్ దగ్గర ఇంగ్లాండ్ బజ్ బాల్ ఆట చెల్లలేదు. తొలి టెస్ట్ గెలిచి వార్నింగ్ ఇచ్చినా.. మన వాళ్ళు ఏ మాత్రం బెదరలేదు. 

హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత వరుసగా వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో వరుస విజయాలతో మరో టెస్ట్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌కు తన మొదటి టెస్ట్ సిరీస్ ఓటమిని రుచి చూపించాడు. 2012 లో ఇంగ్లాండ్ పై స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరిసారిగా ఓడిపోయిన భారత్..  ఇప్పటివరకు ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఈ క్రమంలో వరుసగా 17 టెస్ట్ సిరీస్ లను గెలిచింది. 

ఈ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్..రూట్ (121) సెంచరీతో 353 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ జురెల్ 90 పరుగులతో రాణించడంతో 307 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ తో ధర్మశాలలో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో భారత్ సిరీస్ గెలుచుకుంది. మార్చి 7 నుంచి 11 వరకు చివరిదైన ఐదో టెస్ట్ జరుగుతుంది. ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది.