
దోహా/గాజా: ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖతర్ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. త్వరలోనే ఇజ్రాయెల్, హమాస్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ తో సంధికి దగ్గర్లో ఉన్నామని హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన టెలిగ్రామ్ లో పోస్టు పెట్టారు. డీల్ తుది దశకు చేరుకుందని, త్వరలోనే ఒప్పందం కుదురుతుందని సోమవారం అమెరికా కూడా ప్రకటించింది. తమ దేశ బందీలను విడిచిపెట్టే వరకూ దాడులు ఆపబోమని చెప్పిన ఇజ్రాయెల్.. గాజాపై తూటాల వర్షం కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఐదు రోజులు కాల్పులు ఆపితే తాము బందీలుగా పట్టుకున్న వాళ్లలో కొందరిని విడిచిపెడతామని ఇజ్రాయెల్ కు హమాస్ ప్రతిపాదన చేసింది. దీనిపై ఖతర్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఐదు రోజుల ఒప్పందంలో భాగంగా గ్రౌండ్ అటాక్స్ ను ఇజ్రాయెల్ పూర్తిగా నిలిపివేయాల్సి ఉంటుందని, ఎయిర్ ఆపరేషన్స్ పైనా పరిమితులు ఉంటాయని ఖతర్ వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 300 మంది పాలస్తీనియన్లను విడుదల చేయాల్సి ఉంటుందని చెప్పాయి. దీనికి బదులుగా 50 నుంచి 100 బందీలను హమాస్ విడిచిపెడుతుందని తెలిపాయి. కాగా, హమాస్ వద్ద మొత్తం 240 మంది బందీలుగా ఉన్నారు.
ఆస్పత్రుల వద్ద ఫైరింగ్..
నార్త్ గాజాలో ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇక్కడి ఆస్పత్రుల్లో వేలాది పాలస్తీనియన్లు తలదాచుకోగా, హెవీ ఫైరింగ్ వల్ల వాళ్లందరూ ఆస్పత్రుల నుంచి వెళ్లిపోతున్నారు. సోమవారం ఇండోనేషియన్ ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని, 12 మంది మరణించారని గాజా హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. మంగళవారం కూడా షెల్లింగ్ కొనసాగిందని చెప్పింది. చాలామంది ఆస్పత్రిలో చిక్కుకున్నారని పేర్కొంది. జబాలియా రెఫ్యూజీ క్యాంప్ దగ్గర కూడా ఇజ్రాయెల్ దళాలు ఫైరింగ్ జరిపాయని తెలిపింది. కాగా, నార్త్ గాజాలోని షెల్టర్లలో దాదాపు 1.60 లక్షల మంది ఉన్నారని యూఎన్ ఏజెన్సీ అంచనా వేసింది.