చెరువులతో పని లేకుండా ఇంటి దగ్గరే చేపల పెంపకం

చెరువులతో పని లేకుండా ఇంటి దగ్గరే చేపల పెంపకం

అస్సాంలో ఉండే రంజితకు చిన్నప్పటి నుంచి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించడం అలవాటు. అందుకే ఆమె ఎవరూ నడవని దారులనే ఎంచుకుంటుంది. దేశంలో ఇంటర్నెట్ గురించి అంతగా తెలియని రోజుల్లోనే తన ఊళ్లో ఎంతోమందికి ఇంటర్నెట్ సేవలందించింది. ఇప్పుడామె మనసు చేపల సాగుపై పడింది. చెరువులతో పని లేకుండా ఇంటి దగ్గరే చేపలు పెంచుతూ ఈశాన్య రాష్ట్రాల్లోని చాలామందికి ఇన్‌‌‌‌‌‌‌‌స్పిరేషన్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తోంది.

రంజిత సైకియాకు కొత్త టెక్నాలజీలపై ఇంట్రెస్ట్ ఎక్కువ. కొత్త ఇన్నొవేషన్‌‌‌‌‌‌‌‌లు ఏమేం వస్తున్నాయో రీసెర్చ్ చేసి తెలుసుకుంటుంది. దేశంలో ఇంటర్నెట్ గురించి ఎవరికీ తెలియని రోజుల్లోనే ఊళ్లో ఒక ఇంటర్నెట్ సెంటర్ పెట్టింది. ఊరంతా తిరిగి ఇంటర్నెట్ గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పింది. అలా ఊళ్లో వాళ్లకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ సేవలు అందిస్తూ..  ఆ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పదిహేనేండ్లు నడిపింది. కొవిడ్ తర్వాత ఆ సెంటర్ మూత పడడంతో.. ఈ సారి కొత్తగా ఇంకేదో చేయాలనుకుంది. మళ్లీ తన రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టింది. అప్పుడే తక్కువ ఖర్చుతో..  ఎక్కువ లాభాన్నిచ్చే ‘ల్యాండ్ బేస్డ్ ఫిష్ ఫార్మింగ్’ గురించి తెలుసుకుంది.  యూట్యూబ్ వీడియోలు చూసి ఆక్వాఫొనిక్స్ టెక్నాలజీ పూర్తిగా నేర్చుకుంది.  తన సొంత టెక్నిక్స్ జత చేసి ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫిష్ ఫార్మింగ్ ఒకేసారి కలిపి చేయొచ్చని  తెలుసుకుంది. ప్రస్తుతం ఇంటి దగ్గరే చేపలు, కూరగాయలు పండిస్తూ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.

బోరు నీటితో.. 
బోరు నీటితో చేపలు పెంచే టెక్నాలజీని ‘రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్  సిస్టమ్’(ఆర్ ఏఎస్) అంటారు. ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో ఈ టెక్నిక్ 30 ఏండ్లుగా అందుబాటులో ఉంది. అయితే మనదేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. ‘ఈ ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌లో సక్సెస్ అవ్వాలంటే టెక్నాలజీని సరిగ్గా అర్థం చేసుకోవాల’ని చెప్తోంది రంజిత. ‘తన దగ్గర ఎంతోమంది  ఆక్వా ఫార్మింగ్ టెక్నాలజీని నేర్చుకుంటున్నా,  అందులో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యార’ని  చెప్తోంది. “ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎస్ టెక్నాలజీతో నీరు అంతగా దొరకని ప్రదేశాల్లో కూడా చేపలు పెంచొచ్చు. చెరువుల్లో పెరిగే చేపలకు, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఎస్ పద్ధతిలో పెరిగే చేపలకు చాలా తేడా ఉంటుంది. ఈ పద్ధతిలో చేపలకు కావాల్సిన తిండి టైంకి అందుతుంది. చేపల పెరుగుదలకు అనుగుణంగా టెంపరేచర్స్ మెయింటెయిన్ చేయాలి. చేపల వల్ల ఏర్పడే చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు కొన్ని స్పెషల్ టెక్నిక్స్ వాడాలి.  చేపలకు ఎలాంటి జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నేను అవన్నీ సరిగ్గా మెయింటెయిన్ చేస్తున్నా. అలాగే ఈ టెక్నాలజీలో కొన్ని మార్పులు చేసి, ఖర్చులేకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తున్నా” అని చెప్పింది  రంజిత.

ఫ్రెష్ వాటర్ ఫిష్
రంజిత చేస్తున్న  ఫిష్ ఫార్మింగ్ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద సెన్సేషన్‌‌‌‌‌‌‌‌. కొండలు, పర్వతాలతో పూర్తిగా నిండి ఉండే ఆ ప్రాంతంలో సాధారణ పంటలు పండించడం కూడా కష్టమే. అలాంటి ప్రాంతంలో టెక్నాలజీని ఉపయోగించి చేపలు సాగు చేయాలనే ఆలోచనే ఎవరికీ రాదు. కానీ రంజిత దాన్ని చేసి చూపించింది. తన ఇంటి దగ్గరే వాటర్ ట్యాంకులు కట్టి, అందులో వేల చేపల్ని సాగు చేస్తోంది. ‘ఫ్రెష్ వాటర్ ఫిష్’ పేరుతో చేపలను ఇతర రాష్ట్రాలకు కూడా పంపుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని  పలువులు రాజకీయ నేతలు, ముఖ్యమంత్రుల భార్యలు కూడా రంజితను కలిసి ఆర్ఏఎస్ ఫార్మింగ్ టెక్నాలజీ గురించి అడిగి తెలుసుకున్నారు.రంజిత కారణంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో చాలామంది ఆక్వాఫొనిక్స్ చేసి సక్సెస్ అవుతున్నారు.

ఇంకా తెలుసుకోవాలని ఉంది
“ఆర్ఏఎస్ పద్ధతిలో పెంచే చేపలు పూర్తి ఆరోగ్యంతో ఉంటాయి. వాటిని తింటే మనమూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కెమికల్స్‌‌‌‌‌‌‌‌తో నిండిన వంటకాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏ ఆహారాన్ని అయినా సహజంగా ఎలా పండించాలో తెలుసుకుంటే ఈ సమస్యను తగ్గించొచ్చు.  ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేందుకు ఈ రోజుల్లో రకరకాల టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే యువత తమ కాళ్లపై తాము నిలబడొచ్చు. అలాగే కల్తీని అరికట్టొచ్చు. ‘ల్యాండ్ బేస్డ్ ఫిష్ ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌’ను నేర్పించమని నా దగ్గరకు చాలామంది వస్తుంటారు. వచ్చిన వాళ్లందరికీ  ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను దగ్గరుండి వివరిస్తా. కొందరు నాతోనే ఉంటూ ఫార్మింగ్‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా నేర్చుకుంటున్నారు. టైం ఉంటే ఇలాంటి టెక్నాలజీల గురించి ఇంకా తెలుసుకోవాలని, నేర్పాలనీ ఉంది” అంటోంది రంజిత సైకియా