
- మృతుల్లో ఇద్దరు తల్లీకొడుకులు..మరో ఇద్దరు చిన్నారులు
- కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దాబా గ్రామంలో విషాదం
ఆసిఫాబాద్, వెలుగు: ఖాళీ యూరియా సంచిని వాగులో కడిగేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నలుగురు వాగులో మునిగి మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో జరిగింది. స్థానికులు, పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. దాబా గ్రామానికి చెందిన మోహర్లే నిర్మలబాయి( 33), ఆమె కొడుకు గణేశ్(12), కూతురు లలిత, ఆమె సమీప బంధువుల పిల్లలు ఆదె శశికళ(8), వాడై మహేశ్వరి(10) తో కలిసి శనివారం ఉదయం పత్తి పంటకు యూరియా వేసేందుకు వెళ్లారు. పంటకు యూరియా వేసిన తర్వాత ఖాళీ సంచులను కడిగేందుకు సమీపంలో చికిలి వాగు వద్దకు చేరుకున్నారు.
నిర్మలబాయి సంచులు కడుగుతుండగా.. ఒక సంచి నీళ్లలో కొట్టుకుపోతుండడం చూసి.. సంచిని పట్టుకునేందుకు గణేష్ నీళ్లలోకి దిగాడు. అక్కడ లోతు ఎక్కువ ఉండటంతో మునిగిపోయాడు. గమనించిన తల్లి నిర్మలబాయి కొడుకు గణేష్‌ను కాపాడేందుకు నీళ్లలో దిగగా.. ఆమె కుడా నీట మునిగింది. వారిద్దరిని కాపాడేందుకు వాగు ఒడ్డున ఉన్న చిన్నారులు ఆదె శశికళ, మహేశ్వరి నీళ్లలోకి దిగగా.. కాసేపటికి వాళ్లిద్దరూ నీటిలో మునిగారు.
వాగు ఒడ్డున కూర్చుని ఉన్న నిర్మలబాయి కూతురు లలిత.. వెంటనే పరుగెత్తికెళ్లి తండ్రితోపాటు స్థానికులకు సమాచారం అందించింది. వారు సంఘటనా స్థలానికి చేరుకొని గాలించగా.. నలుగురి మృత దేహలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్ఐ మహేందర్ అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. గణేశ్,శశికళ , మహేశ్వరి ముగ్గురు 5 వ తరగతి చదువుతున్నారు.