
గద్వాల, వెలుగు: చేప పిల్లల పంపిణీకి అడుగడుగునా అడ్డంకులు తగులుతున్నాయి. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి చేప పిల్లలను పంపిణీ చేశారు. ఈసారి టెండర్ ఆలస్యం కావడం, ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల కోడ్ రావడంతో బ్రేక్ పడింది. దీంతో మత్స్యకారులు, మత్స్య సహకార సంఘాల సభ్యులు అసంతృప్తికి లోనవుతున్నారు. ఎన్నికల ముందు నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైందని, చేప పిల్లల పంపిణీకి పర్మిషన్ ఇవ్వాలని ఎన్నికల కమిషన్కు రాష్ట్ర మత్స్య శాఖ అధికారులు లెటర్ రాసినట్లు జిల్లా ఆఫీసర్లు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ వస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా పంపిణీ జరిగే అవకాశం ఉంది. లేదంటే బ్రేక్ పడుతుందని అంటున్నారు.
1.80 కోట్ల చేప పిల్లల పంపిణీపై దృష్టి..
జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టెంపాడు లిఫ్ట్ ద్వారా నీటిని ఎత్తిపోయడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయి. జిల్లాలోని 375 చెరువులు, రిజర్వాయర్లు, కుంటల్లో 60 శాతం నీళ్లు నిండిన వాటిలో 1.80 కోట్ల చేప పిల్లలు వదలాలని మత్స్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గత నెల 18న ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. చిన్న చేప పిల్లల(35ఎంఎం టు 40 ఎం ఎం)కు 62 పైసలు, పెద్ద చేప పిల్లల(80 ఎంఎం టు100 ఎంఎం)కు రూ.1.65 రేటు నిర్ణయించి టెండర్ ఆహ్వానించారు. ఒకే టెండర్ రావడంతో ఎంత మేర చేప పిల్లలు పంపిణీ చేస్తారనే విషయంపై నెగోషియేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక చేప పిల్లలు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ, అంతలోపే లోకల్ బాడీ ఎన్నికల కోడ్ వచ్చింది.
జిల్లాలో 91 సొసైటీలు..
జోగులాంబ గద్వాల జిల్లాలో 91 మత్స్యకార సొసైటీలు ఉన్నాయి. 6,980 మంది సభ్యులు, 2,960 మంది లైసెన్స్ హోల్డర్లతో కలిపి 9,940 మంది మత్స్యకారులు ఉన్నారు. ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తే వీరందరికీ లబ్ధి చేకూరనుంది. వేలాది ఫ్యామిలీలకు ఆర్థికంగా లబ్ది చేకూరుతుందని సంబరపడ్డారు. ఎన్నికల కోడ్ తో చేప పిల్లల పంపిణీ నిలిచిపోతే నష్టపోతామని వాపోతున్నారు.
పర్మిషన్ రావాల్సి ఉంది..
జిల్లాలో చేప పిల్లల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం. ఎన్నికల కోడ్ రావడంతో పంపిణీ నిలిచిపోయింది. పర్మిషన్ కోసం రాష్ట్ర స్థాయి అధికారులు ఎన్నికల కమిషన్ కు లెటర్ రాశారు. పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాం.- షకీలాభాను, మత్స్యశాఖ, ఏడీ