3 లక్షల మంది డ్రైవర్లు, వాహన యజమానులకు ఊరట

3 లక్షల మంది డ్రైవర్లు, వాహన యజమానులకు ఊరట

హైదరాబాద్‌‌, వెలుగు:  వాహనాల ఫిట్‌‌నెస్‌‌ టెస్ట్ లేట్‌‌ ఫీజును సర్కారు తగ్గించనుంది. లేట్ ఫీజు మాఫీపై ఇటీవల ఆర్టీఏ శాఖ ప్రతిపాదనలు కూడా పంపించింది. రెండు, మూడు రోజుల్లో దీనిపై జీవో రిలీజ్ కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. లేట్​ఫీజు రోజుకు రూ.50  పెంపు నిబంధనతో ప్రస్తుతం ఒక్కో వాహనానికి వేలు, లక్షల్లో భారం పడుతోంది. దీన్ని పూర్తిగా మాఫీ చేస్తే రాష్ట్రంలోని 3 లక్షల మంది డ్రైవర్లు, యజమానులకు ఊరట కలగనుంది.

వేలు, లక్షల్లో భారం

రాష్ట్రంలో 15ఏండ్లు నిండిన కమర్షియల్, ట్రాన్స్​పోర్ట్ బండ్లు 30 లక్షల వరకు ఉన్నాయి. ఇందులో ఫిట్‌‌నెస్‌‌ చేయించుకోని బండ్లు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఉండవచ్చని అధికారుల అంచనా. 15 ఏండ్లు దాటిన బండ్లకు రీరిజిస్ట్రేషన్ తప్పనిసరి కావడంతో ఫిట్‌‌నెస్‌‌ రెన్యూవల్ సర్టిఫికెట్‌‌ కోసం యజమానులు పడరాని పాట్లు పడుతున్నరు. ఏప్రిల్‌‌ 1వ తేదీ తర్వాత ఫిట్‌‌నెస్‌‌ చేయించుకుంటే బండి ఫిట్‌‌నెస్‌‌ వ్యాలిడిటీ అయిపోయినప్పటి నుంచి రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తున్నారు. కరోనా, ఇతర కారణాలతో అనేక మంది ఫిట్‌‌నెస్‌‌ రెన్యూవల్‌‌ చేయించుకోలేదు. ఫలితంగా ఒక్కొక్కరికి వేల నుంచి లక్షల్లో లేట్‌‌ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. దీంతో మూడు నెలలుగా ఫిట్‌‌నెస్‌‌ రెన్యూవల్స్‌‌ కూడా తగ్గిపోయాయి. సాధారణంగా నెలకు 50వేల నుంచి లక్షల దాకా రెన్యూవల్స్‌‌ అవుతుండగా, ఇది 30శాతానికి పడిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే యజమానులు కూడా భారీ ఫీజు దెబ్బకు అటు బండి ఉంచుకోలేక.. ఇటు అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నరు.

కొత్త ప్రతిపాదనల్లో పూర్తి మాఫీ

ఫిట్‌‌నెస్ లేట్‌‌ ఫీజుకు సంబంధించి అధికారులు ఇది వరకే పలు ప్రతిపాదనలతో సీఎం కేసీఆర్‌‌కు నివేదిక పంపించారు. అందులో మొదటిది.. ఇప్పుడున్న రోజుకు రూ.50 జరిమానా ఇలాగే కొనసాగించాలని పేర్కొన్నారు. లేట్‌‌ ఫీజును రూ.50 బదులుగా రూ.10కి తగ్గించాలని లేదా లేట్‌‌ ఫీజును గరిష్టంగా వెయ్యి రూపాయలకు పరిమితం చేయాలని ప్రతిపాదనలు చేశారు. అయితే సీఎంవో ఈ రిపోర్ట్​ను తిరస్కరించి మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించింది. అధికారులు పంపిన కొత్త రిపోర్ట్‌‌ ప్రకారం లేట్‌‌ ఫీజును పూర్తిగా మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన జీవో కూడా రెండుమూడు రోజుల్లో విడుదలయ్యే చాన్స్ ఉంది. అయితే ఇప్పటికే ఫిట్‌‌నెస్‌‌ లేట్‌‌ ఫీజు చెల్లించినోళ్లకు ఆ మొత్తం వేర్వేరు రూపాల్లో (క్వార్టర్లీ ట్యాక్స్‌‌ తదితర..) సర్దుబాటు చేయనున్నారు. సర్కారు దీన్ని అమలు చేస్తే సుమారు మూడు లక్షల మందికి ఊరట లభించనుంది.