పులిని చంపిన కేసులో ఐదుగురి అరెస్టు

పులిని చంపిన కేసులో ఐదుగురి అరెస్టు

ములుగు, వెలుగు: ఉచ్చు బిగించి పెద్ద పులిని చంపిన కేసులో ములుగు జిల్లా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఎస్పీ సంగ్రాంసింగ్ జి పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. తాడ్వాయి మండలం కొడిశాల అటవీ ప్రాంతంలో ఉండే మడవి నరేశ్, మడవి ఇరుమయ్య, మడకం ముకేశ్, మడకం దేవ, మడవి గంగయ్య వ్యవసాయ కూలీలు. పనులు చేయగా వచ్చే కూలి సరిపోక వన్యప్రాణులను వేటాడుతున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లాలో తిరుగుతున్న పెద్ద పులిని చంపి క్యాష్​చేసుకోవాలని ప్లాన్​చేశారు. అందులో భాగంగా గత నెల21న ఏర్పాటు చేసిన ఉచ్చులో పెద్దపులి చిక్కుకుని మృతిచెందింది. తర్వాత పులి చర్మం, గోర్లు, ఇతర అవయవాలను స్థానికులు మడకం రామ, ఉంగయ్య, కోవాసి ఇడుమ, ముచకి అండ సాయంతో అడవిలో దాచిపెట్టారు. నరేశ్, ఇరుమయ్య, ముకేశ్, దేవ, గంగయ్య పులి గోర్లు, చర్మం తీసుకొని చత్తీస్​గఢ్​వెళ్తుండగా ఆదివారం ఉదయం కాటాపూర్​క్రాస్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పులి చర్మం, గోర్లు, కళేబరం, ఎముకలు, ఉచ్చులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఐదుగురిపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 
చత్తీస్​గఢ్​ నుంచి వచ్చిన పులి
పులి చత్తీస్​గఢ్ నుంచి వచ్చినట్లు ఈ ఏడాది ఆగస్టు 1న పాదముద్రల ద్వారా సిబ్బంది గుర్తించారని వరంగల్ ​సీసీఎఫ్​ ఆశ చెప్పారు. ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం, హనుమకొండ​ జిల్లాల అడవుల్లో  పులి కదలికలను గమనించామన్నారు.