రాష్ట్రంలో ఒకే రోజు ఐదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమ్మడి వరంగల్జిల్లా పరిధిలో మిర్చి పంట మిగిల్చిన నష్టం భరించలేక ఇద్దరు రైతులు, పంట పెట్టుబడికి తెచ్చిన అప్పు తీరక మరొకరు, ప్రాజెక్టు కాలువ కింద భూమి పోయిందనే బాధతో ఇంకొక రైతు ప్రాణం తీసుకున్నారు. ఆదిలాబాద్జిల్లాలో మరో పత్తి రైతు సూసైడ్ చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లిలో పుట్ట రవి(40) అనే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి పంట వేసిన రవి.. పెట్టుబడి కోసం లక్షల్లో అప్పు చేశాడు. ఈసారి మిర్చి మొత్తం తెగుళ్లు, వర్షాలతో నాశనం కాగా, గత మూండేండ్ల నుంచి కూడా పంటలు పెద్దగా పండక అసలు, మిత్తి పెరిగి అప్పు రూ.15 లక్షలు అయింది. దీంతో మనస్తాపం చెందిన రవి బుధవారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రవికి భార్య వేణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. మరో మిర్చి రైతు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లా తండా పంచాయతీ ఎర్రచకృ తండాలో అప్పుల బాధతో మరో మిర్చి రైతు సూసైడ్ చేసుకున్నాడు. తండాకు చెందిన జాటోత్ భోద్య(55) తనకున్న ఎకరం భూమిలో మిర్చి సాగు చేశాడు. తెగుళ్లు, వర్షాలతో పంట మొత్తం పోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇదీ గాక కూతురు పెండ్లికి రూ. 5 లక్షలు అప్పు తెచ్చాడు. అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మనోవేదనకు గురైన భోద్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
ప్రాణం తీసుకున్న పత్తి రైతు
జనగామ జిల్లా నర్మెట మండలం ఆగపేటలో ఓ యువ రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన నూనె రాజశేఖర్(30) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో పత్తి పెట్టాడు. వర్షాలకు పంట మొదటి దశలో విపరీతంగా పురుగు తగిలి ఏ మాత్రం దిగుబడి రాలేదు. పెట్టుబడి కోసం లక్షల రూపాయలు అప్పు తెచ్చిన రాజశేఖర్ఆ మొత్తం ఎలా తీర్చాలని కొన్ని రోజులుగా బాధపడుతున్నాడు. పనికి వెళ్లి వస్తనని మంగళవారం ఉదయం ఇంట్లోంచి బయటకు వెళ్లిన అతను చీకటిపడినా తిరిగి రాలేదు. కుటుంబీకులు అన్ని చోట్లా వెతికారు. బుధవారం ఉదయం తన వ్యవసాయ బావివద్ద పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రాజశేఖర్ ఓ చెట్టుకింద శవమై కనిపించాడు. అతనికి భార్య కళ్యాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాలువ కింద భూమి పోయిందని..
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో తాను సాగు చేసుకుంటున్న భూమి సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో పోయిందని, మార్కెట్విలువ కంటే పరిహారం తక్కువ వచ్చిందనే బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్నకల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కలసాని భిక్షం(71)కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం ఎకరంన్నర భూమి పోయింది. మార్కెట్విలువ ఎకరం రూ. 20 లక్షలకు పైగా ధర పలుకుతుండగా, ప్రభుత్వం పరిహారం కింద రూ. 12 లక్షలు మాత్రమే ఇస్తోంది. దీంతో రూ.10 లక్షలకు పైగా నష్టపోతున్నానని ఆందోళన చెందిన భిక్షం తన వ్యవసాయ భూమిలో ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చికిత్స పొందుతూ..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని సాంగ్విలో ఓ పత్తి రైతు అప్పు తీర్చలేక సూసైడ్చేసుకున్నాడు. గ్రామానికి చెందిన ఇర్మా తులసీరామ్ తనకున్న 9 ఎకరాల భూమిలో ఈ ఏడాది పత్తి వేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు రూ. 3 లక్షలు అలాగే మిగిలిపోయింది. దీంతో మనస్తాపం చెందిన తులసీరామ్ మంగళవారం పురుగుల మందుతాగాడు. కుటుంబ సభ్యులు రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. రైతు చనిపోయిన విషయం తెలుసుకున్న కంది శ్రీనివాస్ రెడ్డి అనే ఎన్నారై బాధిత కుటుంబానికి రూ. లక్ష సాయం చేశాడు. తులసీరామ్పిల్లల చదువుకు భరోసా ఇచ్చారు.
