కట్టి అయిదేండ్లు.. డ్రా తీసి అయిదు నెలలు.. ఇంకా లబ్ధిదారులకు అప్పగించలే

కట్టి అయిదేండ్లు..  డ్రా తీసి అయిదు నెలలు.. ఇంకా లబ్ధిదారులకు అప్పగించలే

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ ​బెడ్​రూమ్ ​ఇండ్ల కేటాయింపు కోసం లక్కీ డ్రా తీసి అయిదు నెలలు దాటింది. కానీ ఇప్పటికీ ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించలేదు. దీంతో సొంతింటి కోసం పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. లక్కీ డ్రాలో పేరొచ్చి నెలలు గడుస్తున్నా.. ఇండ్లు కేటాయించడం లేదంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఆయా చోట్ల డబుల్ బెడ్​రూమ్​ఇండ్ల నిర్మాణం పూర్తయి 5 ఏండ్లు దాటినా, ఇంకా వాటిని  లబ్ధిదారులకు కేటాయించలేదు. ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 720 డబుల్ బెడ్​రూమ్​ఇండ్లు కంప్లీటయ్యాయి. 

టౌన్​లోని ఇందిరానగర్​కాలనీ, దేవునిపల్లి, టెక్రియాల్,  ఇల్చీపూర్, రామేశ్వర్​పల్లిల్లో వీటిని నిర్మించారు. ఇండ్ల నిర్మాణం కంప్లీటై 5 ఏండ్లు దాటినా, మౌలిక వసతులు లేక లబ్ధిదారులకు కేటాయించలేదు. ఇటీవల రూ.కోటి నిధులతో ఆయా చోట్ల  డ్రేనేజీ, నీటి సదుపాయం, సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల కోసం అప్లికేషన్ల స్వీకరించగా 5,047 దరఖాస్తులు వచ్చాయి. క్షేత్రస్థాయిలో అప్లికేషన్లపై ఎంక్వైరీ చేసి 3,450 మందిని అర్హులుగా గుర్తించారు. ఇండ్లు తక్కువగా ఉండడంతో లక్కీ డ్రా ద్వారా సెలక్ట్ చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిర్ణయించారు. 

డ్రా పద్ధతిలో సెలక్షన్..​

ఈ ఏడాది మార్చి రెండో వారంలో లబ్ధిదారుల సెలక్షన్​కోసం లక్కీ డ్రా తీశారు. వార్డుల వారిగా వచ్చిన అప్లికేషన్లు, ఇండ్ల సంఖ్యను బట్టి డ్రా నిర్వహించారు. సెలక్టయిన వారి వివరాలను లబ్ధిదారులకు తెలిపారు. సెలక్షన్​పూర్తికావడంతో తమకు ఇండ్లు అప్పగిస్తారని లబ్ధిదారులు భావించారు. ఇండ్లు కేటాయిస్తే, శ్రావణమాసంలో మంచి రోజు చూసుకొని గృహ ప్రవేశం చేద్దామని భావించినట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కానీ వీటి అప్పగింతపై యంత్రాంగం శ్రద్ధ చూపడం లేదు. ఇండ్లు కట్టి ఏండ్లు గడుస్తుండడంతో వినియోగంలో లేక శిథిలమవుతున్నాయి. డబుల్ బెడ్​రూం ఇండ్ల కేటాయింపులు, నాణ్యతపై ఇటీవల ప్రతిపక్షాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి. 

డ్రా తీసిన్రు.. ఇల్లియ్యలే


డబుల్ బెడ్​రూమ్​ఇంటికోసం దరఖాస్తు ఇచ్చినా. డ్రా తీస్తే అందులో నాపేరు ఉంది. సొంతిట్లోకి వెళ్లొచ్చని అనుకుంటే ఇప్పటికీ ఇల్లు ఇయ్యలేదు. మా ఇండ్లు మా కిస్తే బయట కట్టే కిరాయి పైసలు మిగులుతాయ్.
- భాగ్య, కామారెడ్డి