సుప్రీంకు మరో ఐదుగురు రెబల్స్

సుప్రీంకు మరో ఐదుగురు రెబల్స్

కర్నాటక పొలిటికల్ డ్రామాలో మరో ట్విస్ట్‌

బెంగళూరుకర్నాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించడం లేదంటూ మరో ఐదుగురు రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే 10 మంది రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి రాజీనామాలు లేదా అనర్హతపై మంగళవారం వరకు స్టేటస్ కో విధిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. శనివారం రెబల్ ఎమ్మెల్యేలు కె.సుధాకర్, రోషన్ బేగ్, ఎంటీబీ నాగరాజ్, మునిరత్న నాయుడు, ఆనంద్ సింగ్ సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. మరోవైపు స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ 10 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాపై పూర్తి వివరాలతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. బలపరీక్షకు తాను రెడీగా ఉన్నట్లు కర్నాటక సీఎం కుమారస్వామి శుక్రవారం ప్రకటించారు. బుధవారం బలపరీక్ష నిర్వహించాలని బీఏసీలో ఆయన కోరారు. బీజేపీ గైర్హాజరవడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సోమవారం ఉదయం బీఏసీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అధికార కాంగ్రెస్, జేడీఎస్ కూటమి, ప్రతిపక్షం బీజేపీ రిసార్టుల్లో క్యాంపులను కొనసాగిస్తున్నాయి. బలపరీక్షకు హాజరు కాకూడదని ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. శనివారం రమేశ్ జార్కిహొళితోపాటు రెబల్ ఎమ్మెల్యేలు షిర్డి సాయిబాబాను దర్శించుకున్నారు. వచ్చేవారం కర్నాటక రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.  రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తే 118 మంది సభ్యులున్న సంకీర్ణ  సర్కారు బలం వందకు పడిపోతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ 113 నుంచి 105కు తగ్గుతుంది.  ఇప్పటికే ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతు సాధించిన బీజేపీ బలం 107కు పెరిగింది.

ఫలించిన ట్రబుల్ షూటర్ చర్చలు

సంకీర్ణ సర్కారును సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ కూటమి నాయకులు శనివారం కూడా ప్రయత్నాలు కొనసాగించారు. ముంబైలో ఉన్న రెబల్ ఎమ్మెల్యేలతో ఫోన్ లో మాట్లాడేందుకు మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రయత్నించారు. రామలింగారెడ్డి, రోషన్ బేగ్ లను ఒప్పించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. సోమవారం తన నిర్ణయం వెల్లడిస్తానని రామలింగారెడ్డి చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డి.కె.శివకుమార్ జరిపిన చర్చలతో కె.సుధాకర్, ఎంటీబీ నాగరాజు కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. “డి.కె.శివకుమార్ ఇతర నేతలు మమ్మల్ని కలిసి రాజీనామా వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిపై సుధాకర్ తో మాట్లాడి ఏం చేయాలో నిర్ణయిస్తాం. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ లోనే ఉన్నా” అని ఎంటీబీ నాగరాజు మీడియాతో అన్నారు. రాజీనామాపై ఆలోచించుకోవాలని మాజీ సీఎం సిద్ధరామయ్య సూచించారని, కొంత సమయం కావాలని ఆయనకు చెప్పినట్లు రెబల్ ఎమ్మెల్యే సుధాకర్ చెప్పారు. మిగిలినవారితోనూ చర్చలు జరుపుతామని డీకే శివకుమార్ ప్రకటించారు. శనివారం సాయంత్రం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ బెంగళూరు చేరుకున్నారు.

కుమారస్వామి రాజీనామా చేయాలి:యడ్యూరప్ప

కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు మెజార్టీ కోల్పోయిందని, కర్నాటక సీఎం కుమారస్వామి రాజీనామా చేయాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, మాజీ సీఎం యడ్యూరప్ప శనివారం డిమాండ్ చేశారు. కుమారస్వామి సభలో బలం నిరూపించుకోవాలని సోమవారం అసెంబ్లీలో పట్టుబడతామన్నారు.బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) మీటింగ్ లో బలపరీక్ష తేదీపై నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి  చేస్తామన్నారు.